ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. మాకు న్యాయం చేయండి

ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. మాకు న్యాయం చేయండి
  • పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగిన బాధిత రైతులు 
  • నల్గొండ జిల్లా నార్కట్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఘటన 

నార్కట్​పల్లి, వెలుగు: తమ భూముల్లో  కంపెనీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని వెంటనే కూల్చివేసి.. న్యాయం చేయాలని కోరుతూ పెట్రోల్ బాటిళ్లతో రైతులు తహసీల్దార్ ఆఫీసు ముందు మంగళవారం నిరసనకు దిగారు.  పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం గోపాలయపల్లి రెవెన్యూ పరిధి సర్వే నం. 550లోని ప్రభుత్వ భూమిని గతంలో రామిడి గోపాల్ కు 30 కుంటలు, కట్ట లక్ష్మి 20 కుంటలు, కళ్లెంపల్లి వెంకటయ్య 20 కుంటలు, కళ్లెంపల్లి గోపాల్ 20 కుంటలు,  కొమురెల్లి రామచంద్రారెడ్డికి 20 కుంటల చొప్పున ఇవ్వగా పట్టా చేయించుకున్నారు. కాగా.. ఆ భూములను రెండు ప్రైవేట్ కంపెనీలు ఆక్రమించుకొని భారీగా నిర్మాణాలు చేపట్టాయి. 

దీనిపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఇటీవల బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించగా, ఇంకా అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు తమ భూముల్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి పట్టా పాస్ బుక్ లోని మేరకు భూమిని సర్వే చేసి  ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు ముందు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. ఎస్ఐ క్రాంతికుమార్ వెళ్లి రెవెన్యూ అధికారులతో రైతులను మాట్లాడించారు. 

 దీనిపై నార్కట్ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ఆ సర్వే నంబర్ లో రామిడి గోపాల్ కు 15 కుంటలు మాత్రమే ఉందని,  మిగతా 15 కుంటల భూమి రికార్డుల్లో లేదని, మిగతా రైతుల భూములు సర్వే చేసిన తర్వాత తెలుస్తుందని తెలిపారు. కంపెనీలకు చెందిన భారీ నిర్మాణాలను తొలగించే మెషీన్లు తమ వద్ద లేకపోవడంతో ప్రభుత్వ తరఫున చర్యలు తీసుకునేలా చేస్తామని ఆయన చెప్పారు.