క్వింటాలుకు 8 కిలోలదాకా తరుగు తీస్తున్నరు

క్వింటాలుకు 8 కిలోలదాకా తరుగు తీస్తున్నరు
  • బస్తాకు 3 కిలోలు ముంచుతున్నరు
  • క్వింటాలుకు 8 కిలోలదాకా తరుగు తీస్తున్నరు
  • ట్రాక్టర్​ లోడ్​లతో రహదారిపై అన్నదాతల రాస్తారోకో

గంభీరావు పేట,వెలుగు:  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల సంచికి 3 కిలోలు ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని రైతున్నలు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చేందిన రైతులు వడ్ల ట్రాక్టర్ లోడుతో  మంగళవారం కామారెడ్డి, సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మిల్లర్లు, నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారని, నిబంధనల కంటే ఎక్కువ తూకం వేస్తుండడంతో  భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంచి బరువు 600 గ్రాములతో కలిసి బస్తాకు 40.6 కిలోలు తూకం వేయాల్సి ఉండగా కేంద్రంలో 43 కిలోల తూకం వేస్తున్నారని ఆరోపించారు. ఈ లెక్కన క్వింటాలుకు ఐదారు కిలోల వరకు నష్టపోతున్నామని, అడిగినంత తరుగు ఇస్తేనే ట్రాక్టర్ అన్ లోడ్ చేస్తామని మిల్లరు చెబుతున్నారన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, సీఐ మొగిలి, ఎస్సై మహేశ్​ఘటనా స్థలానికి చేరుకొని 41 కిలోల తూకం వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.  

కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నరు..

కోనరావుపేట :వడ్ల కొనుగోళ్లలో జాప్యంతోపాటు అధిక తూకం వేసి మిల్లర్లు కటింగ్ పెడుతున్నారని కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో రైతులు మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. బస్తాకు 41కిలోలు తూకం వేయాలని అధికారులు చెప్పినా మిల్లర్లు వినడంలేదన్నారు. 43కిలోలు తూకం వేస్తేనే తీసుకుంటామని చెబుతున్నారని, అధికారులు కూడా మిల్లర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వచ్చే వరకు ధర్నాను విరమించమని ఆందోళన చేయడంతో తహసీల్దార్ నరేందర్ రైతులతో ఫోన్ లో మాట్లాడారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా, అధిక తూకం వేయకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. 

ధాన్యం అన్​లోడింగ్ లో వేగం పెంచాలి 

కోనరావుపేట: మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ లో  వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. మంగళవారం కోనరావుపేట మండలం నాగారం శివారు సరస్వతి రైస్​మిల్ ను ఆయన తనిఖీ చేశారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి సహకరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు కొర్రీలు పెట్టొద్దని సూచించారు. అనంతరం నాగారం, కనగర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.