ట్రిపుల్ఆర్ ​అలైన్ ‌‌మెంట్​మార్చాల్సిందే..

ట్రిపుల్ఆర్ ​అలైన్ ‌‌మెంట్​మార్చాల్సిందే..
  • దేవులపల్లిలో 846 ఎకరాల్లో 170 ఎకరాల భూసేకరణ
  • భూములు పోయి ఆధారం  కోల్పోతున్న రైతులు

సంగారెడ్డి(హత్నూర), వెలుగు: ‘ఇప్పటికే కాళేశ్వరం కాలువల నిర్మాణానికి భూములిచ్చినం.. మళ్లీ ట్రిపుల్ ‌‌ఆర్ ​కోసం భూములు ఇస్తే ఆగమైతం.. ఉన్న ఆధారం కోల్పోయి రోడ్డున పడతం’ అని  రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 846 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. కాళేశ్వరం నీటిని సింగూరు ప్రాజెక్టులోకి తరలించేందుకు ఈ గ్రామం మీదుగా రెండు కాల్వలు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతానికి 100 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ పనులు కొనసాగుతుండగానే అధికారులు ఈ గ్రామం మీదుగా ట్రిపుల్ఆర్ రోడ్డుకు అలైన్ ‌‌మెంట్​రెడీ చేశారు. దీనికోసం మరో 70 ఎకరాలు అవసరం ఉన్నట్లు గుర్తించి సర్వే పనులు పూర్తి చేశారు. భూ బాధితులు, గ్రామస్తులు అనేక ఆందోళనలు, విజ్ఞప్తులు చేసినా వాటిని పట్టించుకున్నవారేలేరు. ప్రస్తుతం ఆయా వ్యవసాయ భూములను సేకరించే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. 

కాళేశ్వరం కోసం 100 ఎకరాలు

కాళేశ్వరం నీటిని సింగూర్ లోకి తరలించేందుకు దేవులపల్లి మీదుగా రెండు లైన్ల కాల్వలు నిర్మించాల్సి ఉంది.  ఒకటి సింగూర్ ‌‌ ‌‌లోకి నేరుగా వెళుతుండగా దీనికి 60 ఎకరాలు అవసరముంది. మరొకటి నారాయణఖేడ్ దగ్గరలోని బోరంచ ఎత్తిపోతల వరకు వేయాల్సి ఉండగా దీనికోసం 40 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మొదటి విడతగా 60 ఎకరాలను సేకరించి పనులు చేస్తున్నారు. మరో లైన్ కోసం సర్వే చేస్తుండగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. నచ్చజెప్పిన అధికారులు 40 ఎకరాలు కూడా సేకరించారు. ఈ పనులు సాగుతుండగానే ట్రిపుల్ఆర్​రూపంలో ఇదే గ్రామంలో మరో 70 ఎకరాలు సేకరించేందుకు ప్లాన్ జరుగుతోంది. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే భూములు కోల్పోయామని, మరోసారి భూసేకరణ చేస్తే తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు. ట్రిపుల్ఆర్​అలైన్ ‌‌మెంట్​మార్చాలని రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు. 

భూమికి భూమి ఇయ్యండి

మా కుటుంబానికి 6 ఎకరాల భూమి ఉంది. కాళేశ్వరం కాలువ కోసం ఇదివరకు రెండు ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రింగ్ రోడ్డు కోసం మరో రెండు ఎకరాలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. పరిహారం తీసుకుని మా ఉపాధి పోగొట్టుకోలేం. అందుకే భూమికి భూమి ఇయ్యాలే. అట్లయితే వ్యవసాయాన్ని నమ్ముకున్న మాకు జీవనధారం ఉంటుంది. భూమి కోల్పోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. 
–సత్తయ్య (బాధిత రైతు)

అయిదున్నర ఎకరాలు పోయాయి..      

నాకున్న అయిదున్నర ఎకరాల్లో  కాళేశ్వరం కాలువల కోసం 3.20 ఎకరాలు పోగా ఇప్పుడు రింగ్ రోడ్డు కోసం 2 ఎకరాలు పోతోంది. సాగును నమ్ముకొని బతుకుతున్న మేము భూమి పోగొట్టుకొని ఏం చేసి బతకాలి. ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారో కూడా చెప్పకుండా సర్వే చేసి భూమి తీసుకుంటామంటే ఎట్లా ఒప్పుకునేది. దయచేసి అలైన్ ‌‌మెంట్​మార్చి మా భూములను వదిలేయండి.
–అంజాగౌడ్ (బాధిత రైతు)