మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని.. హైవేపై ట్రాక్టర్లతో రైతుల ఆందోళన

మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని.. హైవేపై ట్రాక్టర్లతో రైతుల ఆందోళన

మాగనూర్, వెలుగు: మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని రైతులు గురువారం మండలంలోని రెడం వద్ద 167 హైవేపై వడ్ల ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు. గురువారం హైవేపై రోడ్డుకు అడ్డంగా వడ్ల లోడుతో ఉన్న ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గన్నీ బ్యాగుల కోసం అధికారులు డబ్బులు డిమాండ్  చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ కోసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు  డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని, మిల్లుకు పోయాక రెండు కిలోలు అదనంగా ఇస్తేనే దింపుకుంటామని చెబుతున్నారని వాపోయారు. 

అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరలో రైస్​ మిల్లులు ఉన్నా దూరప్రాంతాలకు ట్రక్  షీట్  రాస్తున్నారని పేర్కొన్నారు. దూరంగా ఉన్న మిల్లులకు ట్రాక్టర్లలో వడ్లను తరలించలేమని, సరిపడా లారీలను కేటాయించాలని డిమాండ్  చేశారు. మాగనూర్  ఎస్సై అశోక్​ బాబు, ఏవో సుదర్శన్​గౌడ్​ ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.