ట్రిపుల్​ఆర్​పై కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

ట్రిపుల్​ఆర్​పై కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

మెదక్/యాదాద్రి/సంగారెడ్డి, వెలుగు: ట్రిపుల్​ఆర్​పై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్దల భూములు కాపాడేందుకు అలైన్మెంట్​మార్చడంతో సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. ట్రిపుల్​ఆర్​ ఫస్ట్​ ఫేజ్​పనులు చేపట్టేందుకు ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీ పెద్దల భూములు నష్టపోకుండా అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని 23 గ్రామాల్లో 1,853.04 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో భువనగిరి పరిధిలోని ఒక్క రాయగిరిలోనే 70 మందికి పైగా రైతులు 266.14 ఎకరాలు కోల్పోతున్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం గతంలో 145 ఎకరాలు ఇచ్చిన రాయగిరి రైతులతో పాటు ఎర్రంబెల్లి, గౌస్ నగర్, చౌటుప్పల్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు చెందిన రైతులు ఈసారి తమ భూములు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. సర్వే జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖుల భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు. మొదట రూపొందించిన అలైన్మెంట్ వంగపల్లి, మోటకొండూర్ మీదుగా ఉండగా తర్వాత రాయగిరి మీదుగా మార్చారని అంటున్నారు. మొదట విడుదల చేసిన గెజిట్లో భువనగిరి, నందనం పేర్లు ఉండడం.. రెండో గెజిట్లో లేకపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు.  

మంత్రి వియ్యంకుడి భూములు పోవద్దని..  

రీజినల్ రింగ్ రోడ్డు ఫస్ట్​ఫేజ్​లో మొత్తం 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అందులో ఉమ్మడి మెదక్​ జిల్లాలోనే 105 కిలోమీటర్లు ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలలోని 60 గ్రామాల పరిధిలో 3,429 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వియ్యంకుడు గౌతమ్ రెడ్డి భూమి దాదాపు 20 ఎకరాలు తీర్మాపూర్ పరిధిలో ఉన్నాయి. ఆ భూములను కాపాడేందుకు పక్కనే ఉన్న 15 మంది రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల్లో సర్వే చేయడాన్ని బాధిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ శరత్ ను బాధితులు కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే హత్నూర మండలం దేవులపల్లి, కాసాల గ్రామాల మధ్య రింగ్ రోడ్డు వెళ్లే రూట్లో ఓ పెత్తందారుడికి చెందిన 100 ఎకరాల భూమి ఉండగా, దానిని తప్పించేందుకు అలైన్మెంట్​ మార్చారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ రెండు గ్రామాలలో 23 మంది రైతులు దాదాపు 50 ఎకరాల భూములు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది.

మంత్రి బంధువుల కోసం..

మెదక్​ జిల్లా నర్సాపూర్​మండలం రెడ్డిపల్లి, శివ్వంపేట మండలం కొంతాన్​పల్లి, రత్నాపూర్​గ్రామాల పరిధిలో గతంలో సర్వే నిర్వహించి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గర సర్వే చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు, రైతులు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ మండలంలో  ఇదివరకు సర్వే చేసినపుడు రెడ్డిపల్లి చౌరస్తా దగ్గర నుంచి పెద్దచింతకుంట మధ్య నుంచి రింగ్​రోడ్డు వెళ్తుందని తెలిపారు. ఆ ప్రాంతంలోనే హద్దులు ఏర్పాటు చేశారు. తర్వాత రెడ్డిపల్లి చౌరస్తా నుంచి మెదక్ రూట్లో నుంచి రింగ్ రోడ్డు నిర్మించేలా భూసేకరణకు చర్యలు చేపట్టారు. పెద్దచింతకుంట వైపు ఓ కేబినెట్​ మంత్రి బంధువులకు చెందిన భూములు ఉన్నాయని, వారికి నష్టం కలుగకుండా ఉండేందుకే అలైన్మెంట్​ మార్పించారని రెడ్డిపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. పాత సర్వే ప్రకారం 30 మంది రైతుల భూములు మాత్రమే పోయేవని, అలైన్​మెంట్​ మార్చడం వల్ల దాదాపు 100 మంది చిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని తెలిపారు. శివ్వంపేట మండలంలో కూడా అధికార పార్టీ లీడర్ల భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారంటున్నారు.

ఆందోళనలు.. విన్నపాలు  

అలైన్మెంట్​ మార్పును వ్యతిరేకిస్తూ యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో రైతులు ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ భూములు పోకుండా చూడాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డి పల్లి వద్ద, శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో సర్వేను రైతులు అడ్డుకున్నారు. శివ్వంపేట మండలం దొంతి,  ఈ నెల 18న సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్​ను రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. చౌటకూర్ మండలం వెంకట కిష్టాపూర్ గ్రామానికి చెందిన మంగలి సోమయ్య తన అర ఎకరం భూమి పోతుందని బెంగ పెట్టుకోగా, ఉన్నట్టుండి మీటింగ్ లోనే అతనికి గుండెపోటు వచ్చింది. సోమయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ఇష్యూ కారణంగా ప్రస్తుతానికి అక్కడ సర్వే పనులు నిలిపివేశారు.

భూమి పోతే ఎట్ల బతకాలె

ముందుగల్ల అల్లీపూర్ మీదికెళ్లి రింగ్ రోడ్ పోతదన్నరు. అటు దిక్కు పెద్ద పెద్దోళ్ల భూములు ఉన్నాయని రత్నాపూర్ దిక్కు మలిపినరట. మాకు రెండెకరాల పొలం ఉంది. రింగ్ రోడ్ ల మొత్తం పోతదంటున్నరు. ఆ భూమి పోతే మేమెట్ల బతకాలే. వేరే దగ్గర భూమి కొందామంటే సర్కార్ ఇచ్చే పైసలతో కొన్ని గుంటలు కూడా రాదు. 

– కమలమ్మ, రత్నాపూర్, మెదక్ జిల్లా

లీడర్ల కోసమే మార్చిన్రు

మొదటి అలైన్మెంట్ మోటకొండూరు నుంచి అని చెప్పిన్రు. అక్కడ భూములు ఉన్న లీడర్ల ఒత్తిడితో అలైన్మెంట్ మార్చిన్రు. ఇంతకుముందు మేం మూడుసార్లు భూములిచ్చి నష్టపోయినం. ప్రభుత్వం విడుదల చేసిన మొదటి గెజిట్లో భువనగిరి, నందనం గ్రామాలు ఉండే. అయితే ఈ రెండు ఊర్లలో కొందరు లీడర్ల భూములు ఉన్నాయని, ఆ రెండు ఊర్ల పేర్లు రెండో గెజిట్లో తీసేసిన్రు. 

– పాండు, రాయగిరి, యాదాద్రి జిల్లా

చిన్న రైతులకు అన్యాయం

మా ఊరు దగ్గర ఫస్ట్  అలైన్మెంట్ ప్రకారం రైస్ మిల్లు, దానిని ఆనుకొని ఉన్న భూములు పోవాలి. అలైన్మెంట్ మార్చడంతో చిన్న రైతుల భూములు పోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలకు మా అన్నతమ్ముళ్లవి నాలుగు ఎకరాలు పోయాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కు నాలుగు ఎకరాలు పోయేటట్టుంది. ఉన్నభూమి ప్రాజెక్టుల్లో పోతే బతికేదెట్లా. 

– మాణిక్య గౌడ్, రెడ్డిపల్లి, మెదక్ జిల్లా