గవర్నర్ మేడమ్.. మీరన్న ​వడ్లు కొనిపించండి

V6 Velugu Posted on Dec 09, 2021

  • నల్గొండ జిల్లా పర్యటనలో గవర్నర్ తమిళిసైకి రైతుల వినతి

నల్గొండ, వెలుగు: ‘వడ్లు తెచ్చి శానా రోజులైతంది.. మీరన్న త్వరగా కొనిపించండి మేడం’ అని రైతులు రాష్ట్ర గవర్నర్​తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. బుధవారం నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్.. ​పట్టణంలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్, తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె సెంటర్లలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్జాలబావి సెంటర్​లో  పానగల్​కు చెందిన మహిళా రైతు ఎల్లమ్మతో గవర్నర్​మాట్లాడారు. ‘నేను మీకు తెలుసా’ అని అడిగారు. దీంతో ‘మీరు గవర్నర్​ మేడమ్’ అని ఎల్లమ్మ బదులు చెప్పింది.

తర్వాత చర్లపల్లికి చెందిన మందడి మధుసూదన్​ రెడ్డి అనే రైతుతో గవర్నర్ మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో వరి వేశారు? ఎంత దిగుబడి వచ్చింది? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగారు. తేమ పేరుతో వడ్లు కొంటలేరని గవర్నర్ కు రైతులు​చెప్పారు. అనిశెట్టి దుప్పలపల్లి ఐకేపీ సెంటర్ మహిళలతో గవర్నర్​గ్రూపు ఫొటో దిగారు. అంతకు ముందు నల్గొండ జిల్లా కేంద్రం షేర్​బంగ్లాలో సంతోషిమాత దేవాలయాన్ని గవర్నర్​ప్రారంభించారు. గవర్నర్​కు సీపీఎం, సీపీఐ ప్రతినిధి బృందాలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎఫ్​సీఐ గోడౌన్లలో పేరుకుపోయిన బియ్యాన్ని వెంటనే ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మిల్లుల్లో జాగ లేక వానాకాలం కొనుగోళ్లు లేట్​అవుతున్నాయని చెప్పారు. 

Tagged Telangana, tour, Nalgonda district, governor, request, paddy, purchase, visit, Tamilisai, Farmer\\\'s

Latest Videos

Subscribe Now

More News