చావనైనా చస్తాం కానీ.. రైల్వే లైన్ వేయనియ్యం

చావనైనా చస్తాం కానీ.. రైల్వే లైన్ వేయనియ్యం
  • ఖమ్మం రూరల్​ మండల  రైతులు నిర్ణయం

ఖమ్మం రూరల్, వెలుగు: డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్త ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్​ఖమ్మం రూరల్ మండలంలోని జాన్​బాద్ తండా, దారేడు, గూడురుపాడు, ఎంవీ పాలెం, ఆరెకోడు, ఆరెంపుల, పొన్నెకల్లు, మద్దులపల్లి, తెల్దారుపల్లి రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తోంది. ఈ గ్రామాలన్నీ ఖమ్మం సిటీని ఆనుకొని ఉండటంతో ఇక్కడి భూమల రేట్లు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. రైల్వే లైన్​వేస్తే భూములు కోల్పోతామని, మిగిలిన భూములకు ధరలు తగ్గుతాయని ఈ గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఈ విషయమై గురువారం ఎంవీపాలెం, గూడూరుపాడు, కాచిరాజుగూడెం రైతులు ఎంవీ పాలెం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎంఎల్ ప్రజాపందా పార్టీల లీడర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ.. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ.. తమ గ్రామాల మీదుగా రైల్వే లైన్​ వేయనియ్యమని తేల్చి చెప్పారు. అన్ని గ్రామాల ప్రజలు కలిసి రైల్వే సర్వే జరగకుండా అడ్డుకోవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నండ్ర ప్రసాద్, లీడర్లు పుచ్చకాయల సుధాకర్, దొండేటి సత్యం, కుర్రా వెంకన్న, మాదాల వాసయ్య, పడిగల ఉపేందర్, మోహన్ రావు, రామగిరి వెంకన్న, కొలిచలం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.