రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి

రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి

గత పదేండ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా చత్తీస్​గఢ్,​ కేరళ రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో  ఆలోచించలేదు. గత పదేండ్లుగా వరి రైతులకు కనీస మద్ధతు ధరకు  అదనంగా ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదు. ప్రతి సంవత్సరం స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ధర ఎంత చెల్లించాలో లెక్క చేసి కేంద్రానికి ఉత్తరం రాసి  చేతులు దులుపుకునేది. 

కానీ, కేంద్రం ఆ ఉత్తరాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తే, తాను ఈ రాష్ట్ర  రైతులను ఆదుకోవడానికి ధర బోనస్ రూపంలో అదనంగా చెల్లించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ ప్రభుత్వం రైతులను   మోసం  చేసిందని    గగ్గోలు పెడుతున్నది.   ఇదంతా పచ్చి రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు. 

వరి రైతులకు బోనస్ ఇవ్వకపోయినా రైతుబంధు ఇచ్చాం అంటారేమో?  2018 ఖరీఫ్ నుంచి కేసీఆర్​ ప్రభుత్వం ఎకరానికి సీజనకు రూ.5,000  రైతుబంధు పెట్టుబడి సహాయం పథకాన్ని తీసుకు వచ్చింది. కానీ ఈ  పథకం పంట సాగుదారులకు కాకుండా,  భూముల యజమానుల  కోసం తెచ్చింది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న 22 లక్షల కౌలు రైతు కుటుంబాలకు ఈ  పథకం ద్వారా ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదు. 

మరోవైపు వందల ఎకరాలు ఉన్న భూ యజమానులకు వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేయకపోయినా, వేల  కోట్లు దోచి పెట్టింది. పైగా రైతు బంధు సహాయమందిస్తున్నాం అనే పేరుతో అన్ని సబ్సిడీ పథకాలను ఆపేశారు. విత్తన సబ్సిడీ, యంత్రాల సబ్సిడీ , పంటల బీమా పథకం ప్రీమియం సబ్సిడీ, పంట రుణాలపై వడ్డీ రాయితీ సబ్సిడీ, సూక్ష్మ నీటి పరికరాల సబ్సిడీ, ఉద్యాన పంటల రాయితీ పథకాలను నిలిపి వేసింది. కాబట్టి నిజమైన రైతుకు రైతు బంధు పథకం వల్ల అదనంగా అందిన ప్రయోజనమేమీ లేదు. 

వరికి బోనస్  హామీ - అశాస్త్రీయమైనది  

ఎలాగైనా సరే, ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టాలని ఒక రాజకీయ పార్టీకి ఆశ ఉండవచ్చు కానీ, ఇందుకోసం అనాలోచిత,  అశాస్త్రీయ హామీలను ఇవ్వకూడదు. కాంగ్రెస్  పార్టీ ఆ తప్పు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2022లో కాంగ్రెస్ పార్టీ వరంగల్  డిక్లరేషన్​లో వరికి బోనస్ ఇస్తామనే హామీని ఇవ్వలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో అది చేరింది. 2020 నుంచి తెలంగాణలో వరి పై చర్చ విస్తృతంగానే సాగుతూ వచ్చింది.

 కేసీఆర్​ కూడా అనాలోచితంగా కోటి ఎకరాల మాగాణం పేరుతో  రైతులను వరి వైపు నెట్టాడు. కాళేశ్వరం కింద నీళ్లు ఉన్నాయి కనుక వరి వేయండి, ధాన్యాన్ని అంతర్జాతీయ మార్కెట్​లో అమ్ముతాం అని కూడా హామీ ఇచ్చాడు. ఈ  హామీ రాష్ట్రంలో వరి విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి కారణమైంది. ఈ  విషయంలో మేము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నాలుగు  కారణాల రీత్యా రాష్ట్రంలో వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని సూచిస్తూ వచ్చాం. 

వరి పంట రాష్ట్రానికి గిట్టుబాటు కాదు

మన రాష్ట్రంలో సాగు నీరు గ్రావిటీ ద్వారా కాకుండా, ఎత్తిపోతల పథకాలు, బోర్లు,  బావులు తదితర ఎక్కువ విద్యుత్ వినియోగించే వనరుల ద్వారా అందుతుంది కనుక, సాగు నీరు  ఇక్కడ ఉచితం కాదు, పైగా అత్యంత ఖరీదైనది. కాబట్టి ఖరీదైన నీళ్ళు వాడి వరి సాగు చేస్తే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. (ఉచిత విద్యుత్ బిల్లులు ప్రభుత్వం కట్టినా సరే, ఆ డబ్బులు ప్రజలవే), కాబట్టి ఇప్పుడున్న కనీస మద్దతు ధరలతో వరి సేద్యం రాష్ట్రానికి గిట్టుబాటు కాదు. 

 కిలో బియ్యం ఉత్పత్తికి 5000 లీటర్ల నీరు అవసరం కాబట్టి, అంత ఖరీదైన  నీళ్ళు వాడి, వరి పండించి, తక్కువ ధరలకు వ్యాపారులకు ధాన్యం  అమ్మడం,  విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం రాష్ట్ర నిధులను దుబారా చేయడమే. వరి ధాన్యం ఉత్పత్తిలో రసాయనాల వినియోగం చాలా ఎక్కువ. ముఖ్యంగా రసాయన ఎరువుల వినియోగం వల్ల, వరి పండే అన్ని ప్రాంతాలలో ఉద్గార వాయువులు భారీగా వెలువడతాయి. ముఖ్యంగా ఈ  వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ , మిథేన్, నైట్రోజెన్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ లాంటివి మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తాయి. 

పైగా పంట వ్యర్ధాల పేరుతో గడ్డి తగలేయడం వల్ల కూడా కాలుష్యం  పెరుగుతుంది. భూమి స్వభావం మారిపోతుంది. అవసరమైన సూక్ష్మ  జీవులు చచ్చిపోతాయి. భూమి గట్టిపడి నీళ్ళు పీల్చుకునే  స్వభావం కోల్పోతుంది. కేవలం పత్తి, వరి విస్తీర్ణం పెరగడం వల్ల పంటల వైవిధ్యం తగ్గిపోయి మోనో క్రాపింగ్  అవుతుంది. ఇప్పటికే రాష్ట్రానికి అవసరమైన పప్పు  ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. వరికి మరింత ప్రోత్సాహం లభిస్తే, మిగిలిన పంటలు రాష్ట్ర భూభాగం నుంచి పూర్తిగా మాయమైపోతాయి. 

అప్పుల ఊబిలో రాష్ట్రం

ఉచిత విద్యుత్, పంటల బీమా, రైతు బీమా పథకాలకు  అదనపు  ఖర్చులు ఎలాగూ  ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటే, ఇవన్నీ సాధ్యమే అవుతాయి. కానీ, కేసీఆర్​ సర్కార్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించింది. ఇప్పటికీ అనేక రంగాలలో ఆ ప్రభుత్వం వదిలేసి పోయిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలు ఉన్నాయి. ఆర్ధికమంత్రిగా  పనిచేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిన హరీష్ రావు లాంటి వాళ్ళు ఇవేవీ మాట్లాడకుండా, బోనస్ మొత్తం ధాన్యానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.

 ఇది వారిలో నిండి ఉన్న హిపోక్రసీ మాత్రమే.  ప్రస్తుతం రేవంత్ సర్కార్ , 2024 ఖరీఫ్ నుంచి సన్నాలకు మాత్రమే రూ. 500  బోనస్ ఇస్తామని ప్రకటించింది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే. ఇందుకు అనుగుణంగా భారత ఆహార సంస్థతో చర్చించి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు కొన్ని చేపట్టాలి. 

ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి

ఆయా పంటలకు నాణ్యమైన విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ఇతర పంటలు వేస్తే, ఆయా పంటలను రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందని ప్రకటించాలి. మార్క్ ఫెడ్,  విజయ ఆయిల్ కార్పొరేషన్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల కంపెనీల  ద్వారా రైతుల నుంచి ఆయా పంటలను సేకరించాలి. సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ఆయా పంటల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలి. 

నిల్వ కోసం క్లస్టర్ స్థాయిలో స్థానికంగా గిడ్డంగులను నెలకొల్పాలి. ప్రతిపక్ష పార్టీల విమర్శల ఒత్తిడికి కొట్టుకుపోకుండా, రైతుల పక్షాన నిలబడి దీర్ఘ కాలిక  దృష్టితో ఆలోచించాలి. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే  స్వామినాథన్  కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలను ప్రకటించినా, ప్రకటించిన కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించినా, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. 

వరి బదులు ఇతర పంటలను ప్రోత్సహించాలి

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వరి మానేసిన రైతులకు ఎకరానికి రూ. 7,500  సహాయం అందిస్తామని ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రం కూడా వరి నుంచి ఇతర పంటల  వైపు రైతులను మళ్లించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. పంజాబ్​లో  ఖరీఫ్​లో వరి, రబీలో గోధుమ మాత్రమే సాగు చేయడం వల్ల ఆ రాష్ట్ర  భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇతర అనేక పర్యావరణ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. 

నిజానికి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పంజాబ్, హర్యానా తరహా సమస్యలను ఎదుర్కొంటున్నది. కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు వరి నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి పూనుకోవలసిన సమయం ఇది. 

వ్యవసాయంమరింత దారుణ స్థితికి..

కానీ, విషాదం ఏమిటంటే, ఇవేవీ పట్టించుకోకుండా , కాంగ్రెస్ పార్టీ, అనాలోచితంగా, తొందరపాటుతో వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500  బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ హామీ పూర్తి స్థాయిలో అమలయితే రాష్ట్ర వ్యవసాయం  మరింత దారుణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ  సీజన్ నుంచి రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000 రైతు భరోసా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి  అదనంగా ఎకరానికి సుమారు మరో రూ. 12,000  సన్న ధాన్యంపై బోనస్ చెల్లించడం కోసం కేంద్రం సహకరించకపోతే,  రాష్ట్ర ఖజానాపై తప్పకుండా భారమే అవుతుంది.

ఇతర పంటలే శ్రేయస్కరం

ధాన్యం మిల్లింగ్​లో అవకతవకలు, అవినీతి కారణంగా, ఇందులో ఆనాటి అధికార  బీఆర్ఎస్ నాయకుల పాత్ర కారణంగా రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం ఎఫ్​సీఐకి బియ్యం సరఫరా సరిగా జరగడం లేదు . ఈ కారణంగా ఎఫ్​సీఐ నుంచి రాష్ట్రానికి సరిగా డబ్బులు రావడం లేదు. ఫలితంగా ధాన్యం సేకరిస్తున్న పౌరసరఫరాల శాఖ వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాక, కొన్ని వేల  కోట్లు నష్ట పోయింది కూడా.  

 దొడ్డు ధాన్యం పండించడానికి రైతులు  అలవాటుపడ్డారు. సన్న ధాన్యం కంటే ఎకరానికి సగటు దిగుబడులు ఎక్కువ ఉండడం, తెగుళ్లు తక్కువ ఉండడం కూడా దొడ్డు ధాన్యం సాగు పెరగడానికి మరో కారణం. ఇకపై తెలంగాణ నుంచి పారా బాయిల్ద్ బియ్యం తాను సేకరించలేమని ఎఫ్​సీఐ ఇప్పటికే అనేకసార్లు చెప్పిఉంది.   రైతులతో చర్చించి, నచ్చ చెప్పి, రబీలో ధాన్యం సాగు నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా  దృషి పెట్టి  పని చేయాలి.