
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని రైతులు ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేసేలా వారిని ప్రోత్సహించాలని హార్టికల్చర్ కమిషనర్, ఆసిఫాబాద్‌జిల్లా ప్రత్యేక అధికారి అజ్మీర ప్రేమ్ సింగ్ సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎండీ అబ్దుల్ నదీమ్ ఖుద్దుసీ, కాగజ్ నగర్ ఉద్యాన అధికారి సుప్రజ, మ్యాట్రిక్స్ కంపెనీ సీఈవో ఉదయ్ కుమార్, అధికారులతో కలిసి గురువారం ఉద్యాన శాఖ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు.
ప్రేమ్‌సింగ్ మాట్లాడుతూ.. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీర్ఘకాలిక పండ్ల తోటలైన మామిడి, జామ, నిమ్మ, పనస, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ సాగుతోపాటు ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. అంతర్ పంటలుగా కూరగాయలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు.
కూరగాయల సాగుకు 50 శాతం, శాశ్వత పందిరి, మల్చింగ్ సాగుకు 50 శాతం, బిందు సేద్య పరికరాలకు 90 శాతం, స్ప్రింక్లర్లు, తుంపర సేద్య పరికరాలకు 75 శాతం, వెదురు సాగుకు 75 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.