
- జిల్లాలో 20వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం
మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తోటకు జిల్లాలో 20వేల ఎకరాలు అనుకూలంగా ఉందని గతంలో అధికారులు చెప్పడంతో ఆయా ప్రాంతాల రైతులు ‘సబ్సిడీ ఇవ్వండి.. సాగు చేస్తాం’ అంటూ ముందుకొస్తున్నారు. అందుకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నా చర్యలు చేపట్టడంలో అధికారులు డిలే చేస్తుండటంతో రైతులు నిరాశలో ఉన్నారు.
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా లేదని హర్టికల్చర్ ఆఫీసర్లు మొదట్లో చెప్పారు. కానీ నిజాంపేట్ మండలం చల్మెడలో వెంకట్రావు అనే రైతు సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను పరిశీలించిన తర్వాత జిల్లాలో నేలలు, వాతావరణం ఈ తోట సాగుకు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో దాదాపు 20 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అవకాశం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో వారి నివేదిక మేరకు ప్రభుత్వం కూడా జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి ఆసక్తి ఉన్న రైతులతో తోట సాగు చేయించాలని నిర్ణయించాయి. సంబంధిత అధికారులు విత్తన నర్సరీల ఏర్పాటుకు చర్యలు కూడా చేపట్టారు. గత సెప్టెంబర్‌లో జరిగిన జడ్పీ మీటింగ్‌లోనూ ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ తోటలకు డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పడంతో జిల్లాలో చాలా మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రక్రియ ఇంకా షురూ కాలే..
ఆయిల్ పామ్ సాగు విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులు పలు విధాలుగా మేలని చెబుతున్నా, రైతులకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తామంటున్నా ఆ దిశగా తీసుకుంటున్న చర్యల్లో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ తోట సాగు చేసేందుకు జూన్ నుంచి డిసెంబర్వరకు అనుకూలమైన సమయం. అదును దాటిపోతున్నా ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో ఇంకా ఎక్కడా ఒక్క ఆయిల్ పామ్మొక్క కూడా నాటలేదు. సాగు రైతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా షురూ కాలేదు. ఆసక్తి చూపుతున్న రైతులు హార్టికల్చర్ ఆఫీస్ కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పామ్ఆయిల్ సాగుకు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సిద్దిపేటలో ఇచ్చి.. మెదక్‌లో ఇవ్వట్లే..
సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ స్కీం అమలు చేస్తూ మెదక్జిల్లాను నిర్లక్ష్యం చేస్తోంది. ఈ తోటల సాగుకు మెదక్ జిల్లాలో కూడా రైతులు ఆసక్తిగా ఉన్నారని తెలిసీ డిలే చేయడం సరికాదు. వెంటనే ఇక్కడి ఆయిల్ పామ్ సాగు రైతులకు సబ్సిడీ స్కీం అమలు చేయాలి. - ప్రభాకర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
ఐదెకరాల్లో సాగు చేస్తా..
ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి నేను రెడీగా ఉన్న. కానీ ప్రభుత్వం లేటు చేస్తుంది. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలె. - నింబాద్రి రావు, రైతు, రత్నాపూర్