కామారెడ్డి జిల్లాలో ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో

కామారెడ్డి జిల్లాలో ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో

లింగంపేట, వెలుగు: రైస్​మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దింపుకోవాలని డిమాండ్​చేస్తూ కామారెడ్డి జిల్లా  లింగంపేటతో రైతులు   రాస్తారోకో చేశారు. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్​మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని భవానీపేట, జల్దిపల్లి, రాంపూర్​ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. సివిల్​సప్లయ్​అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు చేసిన వరి ధాన్యం సకాలంలో రైస్​మిల్లులకు తరలించడంలేదని, ఫలితంగా కేంద్రాల్లో  ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయని రైతులు మండిపడ్డారు. ఎస్సై దీపక్​కుమార్, ఆర్​ఐ కిరణ్​రైతులను సముదాయించారు. సివిల్ సప్లయ్​డీఎం శ్రీకాంత్ తో ఫోన్​లో మాట్లాడించారు. కొనుగోళ్లను స్పీడప్​చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో  విరమించారు.

తహసీల్దార్​ ఆఫీస్ ​వద్ద రైతుల ఆందోళన

జన్నారం, వెలుగు: కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం ధర్నా చేశారు. గ్రామంలో పొనకల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజుల క్రితం మొక్కజొన్న పంటను కుప్పలుగా పోశామని, కానీ ఇప్పటివరకు సొసైటీ సిబ్బంది కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. అకాల వర్షం కురిసే ఆవకాశముందని, ఇప్పటికైనా పంటను కొనుగోలు చేయాలని కోరారు. తహసీల్దార్ బక్కయ్యను కలిసి సమస్యను వివరించగా త్వరలోనే కొనుగోలు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.