
జగిత్యాల/రాయికల్/ఖానాపూర్, వెలుగు : తడిసిన వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, రాయికల్ మండలం సింగరావుపేట, నిర్మల్ జిల్లా సుర్జాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయకపోవడం, కొన్న వాటిని తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నష్టపోతున్నామని, త్వరగా వడ్లు కొనాలని ఆఫీసర్లను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. తిప్పన్నపేటలో ఆందోళన విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత వచ్చి వడ్లు కొంటామని హామీ ఇచ్చారు. సింగరావుపేటలో ఆందోళన విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత వచ్చి రైతులకు మద్దతుగా బైఠాయించారు. తహసీల్దార్ గణేశ్, ఆర్‌ఐ దేవదాస్ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుర్జాపూర్‌లో తహసీల్దార్ సుజాతారెడ్డి వచ్చి హామీ ఇచ్చారు.