సంస్థాన్ నారాయణపురం, వెలుగు: రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో కాంగ్రెస్ లీడర్లు, రైతులు ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం రైతులతో సంస్థాన్నారాయణపురంలోని రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.
అదే టైంలో కాంగ్రెస్ నాయకులు, కొందరు రైతులు అక్కడికి చేరుకున్నారు. గతంలో సీఎం కేసీఆర్ఇచ్చిన హామీ ప్రకారం.. రైతుల రుణాలను మాఫీ చేయాలని నినాదాలు చేశారు. రాచకొండ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతు వేదికలో పార్టీ మీటింగులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతు వేదిక లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని, విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని చెప్పారు. చెరువుల్లో పూడిక తీసి, 24 గంటల కరెంటు ఇస్తూ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఆందోళనలో నారాయణపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏపూరి సతీశ్, మందుగుల బాలకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.