సూర్యాపేటలో యూరియా కోసం రైతుల తిప్పలు

సూర్యాపేటలో యూరియా కోసం  రైతుల తిప్పలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట,  కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. వర్షాలు సరిగా లేక, నాగార్జునసాగర్ కాలువ నీళ్లు రాక, బోర్లు బావుల కింద గతేడాది కంటే తక్కువగా  వరి పంట సాగుచేశారు. సాగు చేసి నెల గడుస్తుండగా వరికి మొదటి విడతగా యూరియా వేద్దామనుకుంటే జిల్లా వ్యాప్తంగా అవసరమైనంత యూరియా దొరకడం లేదు. కొరత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు షాపుల వద్ద  రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. బుధవారం  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం  గోదాం వద్ద, నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం కల్లూరు, మేడారం, దాసారం, ఎల్లారం గ్రామాల రైతులు బారులు తీరారు.

 ఇప్పటికే సరిపడా నీళ్లు లేక పంటలు దెబ్బ తింటుండగా.. యూరియాను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో  సూర్యాపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సఫ్లైలో  ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అన్ని విధాల తమను ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం..ఎరువుల కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని  రైతులు వాపోతున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి రామారావును వివరణ కోరగా.. సూర్యాపేట జిల్లాకు కావలసిన యూరియా స్టాక్ ఉందని తెలిపారు. రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో దిగుమతి చేసుకోలేకపోయామని చెప్పారు. త్వరలోనే కావాల్సినంత యూరియా అందుబాటులోకి తేస్తామని.. ఏ ఒక్క రైతు 
అధైర్య పడవద్దని కోరారు.