పాపన్నపేటలో పత్తాలేని పత్తి కొనుగోలు కేంద్రం!

పాపన్నపేటలో పత్తాలేని పత్తి కొనుగోలు కేంద్రం!

మెదక్/పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు : పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన అధికారులు ఇంత వరకు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మెదక్​ జిల్లాలో మొట్టమొదటిసారిగా పాపన్నపేట మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని  అధికారులు ప్రకటించారు. మెదక్ జిల్లాలో ఎక్కడా జిన్నింగ్​ మిల్లులు లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలం రాంసాన్​పల్లిలోని సిద్ధార్థ్​ ఫైబర్​ జిన్నింగ్​ మిల్​ కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నట్టు అడిషనల్ కలెక్టర్​ రమేశ్ ​ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో గత అక్టోబర్​లో కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. నవంబర్​ మొదటివారం నుంచే కేంద్రం ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ పత్తి కొనుగోలు కేంద్రం పత్తా లేదు.

రై‌‌‌‌తులకు తప్పని తిప్పలు..

మెదక్​జిల్లాలో ఈసారి 48,257 ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా 3.86 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పత్తి తీయడం మొదలై 
చాలా రోజులు అవుతోంది. కానీ పాపన్నపేటలో ఏర్పాటు చేస్తామన్న పత్తి కొనుగోల కేంద్రం మాత్రం  ఇంకా ఏర్పాటు కాకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. పత్తిని అమ్ముకునేందుకు 
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, సమయం వృథా కావడం లాంటి ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు 
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాపన్నపేటలో త్వరగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని 
కోరుతున్నారు. 

ఏడ అమ్మాల్నో అర్థమైతలే.. 

ఈయేడు రెండెకరాల్లో పత్తి చేను ఏసిన. పత్తి కూడా ఏరిన. కానీ ఏడ అమ్మాల్నో అర్థమైతలే. అట్లనే పెడితే ఖరాబ్ అయితదని భయమైతుంది. పాపన్నపేటలో కొనేతట్టు చేస్తమన్నరు... కానీ ఇంకా చేస్తలేరు. పాపన్నపేటలోనే జల్ది కొంటే బాగుండు. 
- కొమురయ్య, రైతు, చెన్నాపూర్, ​శివ్వంపేట మండలం