అప్పుడు రైతులు.. ఇప్పుడు కూలీలు

అప్పుడు రైతులు.. ఇప్పుడు కూలీలు
  • కాళేశ్వరానికి జాగలిచ్చి కూలీలైన్రు
  • భూసేకరణలో 2013 చట్టాన్ని పట్టించుకోని సర్కారు
  • బహిరంగ మార్కెట్​లో ఎకరా 20 లక్షల నుంచి 50 లక్షలు
  • సర్కారు ఇచ్చింది కేవలం5 లక్షల నుంచి 8 లక్షలే
  • అప్పులు, రోగాలు, పిల్లల పెండ్లిలకే సగానికిపైగా ఖర్చు
  • మిగిలిన మొత్తంతో భూములు కొనలేకపోయారు
  • కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారిన రైతులు


నెట్​వర్క్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాకపోగా.. భూములు, ఇండ్లు త్యాగం చేసినోళ్లు పేదలయ్యారు. సర్కారు ఇచ్చిన అరకొర పరిహారంతో ఇంకోచోట భూములు కొనుక్కోలేక నిర్వాసిత రైతులు కాస్త.. కూలీలుగా మారారు. కొందరైతే రోడ్ల వెంట పండ్లు, కంకులు, కూరగాయలు అమ్ముకుంటూ కష్టంగా కుటుంబాలను సాదుకుంటున్నారు. అదే టైమ్​లో ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి మాత్రం ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 20 రిజర్వాయర్లు, 1,734 కి.మీ. పొడువునా కాల్వలు, టన్నెళ్లు, పైపులైన్లు, పంప్​హౌస్​ల నిర్మాణం కోసం 79,236 ఎకరాలు అవసరమని అప్పట్లో సర్కారు ప్రకటించింది. 

ఇప్పటివరకు 59,478 ఎకరాలు సేకరించింది. ఇందులో అటవీ, సర్కార్​ జాగాలు తీసేస్తే రైతుల నుంచి సేకరించిన సాగు భూములు ఏంతక్కువ 50 వేల ఎకరాలు ఉంటాయి. భూసేకరణ సందర్భంగా తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​ చేశారు. లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ రేటుకు మూడు రెట్లు చెల్లించాలని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిదైన మేడిగడ్డ రిజర్వాయర్ (జయశంకర్​భూపాలపల్లి) నుంచి చివరిదైన బస్వాపూర్ రిజర్వాయర్​(యాదాద్రి) వరకు ఆయా జిల్లాల్లో అప్పట్లోనే ఎకరం ధర రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంది. చాలా చోట్ల ఇండ్లను, సాగు భూములను సర్కార్ బలవంతంగా సేకరించింది. నిర్వాసితులకు ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు మాత్రమే చెల్లించింది.

అప్పుడు రైతులు.. ఇప్పుడు కూలీలు

సర్కారు ఇచ్చిన పరిహారంతో నిర్వాసితులు మరోచోట భూములు కొనుక్కోలేకపోయారు. నాలుగైదు ఎకరాలకు పైగా భూమి కోల్పోయిన వారిలో కొద్దిమంది మాత్రమే పరిహారానికి మరికొంత ఋజమ చేసి అక్కడక్కడ ఎకరం రెండెకరాలు కొనుక్కోగలిగారు. పలు దఫాలుగా వచ్చిన పరిహారం గతంలో చేసిన అప్పులు, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు, ఇంటి నిర్మాణానికే ఖర్చయ్యాయి. దీంతో చాలా మంది రైతులు కూలీలుగా మిగిలిపోయారు. ఎవుసం తప్ప వేరే పని తెలియని రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. కొందరు భవన నిర్మాణ కార్మికులు కాగా, ఇంకొందరు రోడ్ల వెంట కూరగాయలు, పండ్లు, మక్కకంకులు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాలకు చెందిన పసుల స్వరూప కుటుంబం కొండ పోచమ్మ సాగలో 30 గుంటల సాగుభూమి, ఇల్లు కోల్పోయింది. భూమికి, ఇంటికి కలిపి ప్రభుత్వం రూ.8 లక్షల పరిహారం చెల్లించింది. ప్రస్తుతం తునికి బొల్లారంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటున్నారు. పరిహారం డబ్బులో కొంత షెడ్ నిర్మాణానికి ఖర్చుకాగా, మిగిలిన మొత్తం అనారోగ్యంపాలైన స్వరూప ట్రీట్​మెంట్ కు వెచ్చించారు. ప్రస్తుతం స్వరూప భర్త కన్​స్ట్రక్షన్ లేబర్​గా పని చేస్తుండగా.. ఆమె ఆర్ అండ్ ఆర్ కాలనీలో కూరగాయలు అమ్ముతోంది. వీరికి టెన్త్ చదివే కొడుకు, 8వ తరగతి చదివే కూతురు ఉంది. చాలీచాలని ఆదాయంతో ఈ కుటుంబం నానా కష్టాలు పడుతోంది.

మల్లన్నసాగర్​ కింద పొలం, ఇల్లు మునిగిపోవడంతో సిద్దిపేట జిల్లా తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన అజ్మీరా భాస్కర్ ఆటో నడుపుకుంటున్నాడు. భాస్కర్ కుటుంబానికి చెందిన రెండు ఎకరాల భూమి, ఇల్లు మునిగిపోయాయి. భాస్కర్ వాటాగా రూ.3.50 లక్షలు పరిహారంగా వచ్చాయి. గజ్వేల్​లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. పరిహారం సొమ్ములో కొంత అప్పు కట్టాడు. మిగిలిన డబ్బుకు మరికొంత కలుపుకుని ఆటో కొనుక్కున్నాడు.

ఈయన పేరు బొడ్డు చంద్రయ్య. ఈయనది జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామం. మంచిర్యాల జిల్లా వేంనూర్ లో చంద్రయ్యకున్న మూడు ఎకరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయాయి. సర్కారు ఇచ్చిన డబ్బులతో వెల్గటూర్ మండలం రాజక్కపల్లిలో ఎకరం భూమి కొన్నాడు. ఇప్పుడు ఆ ఎకరం భూమిని కూడా కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టు కింద ప్రభుత్వం తీసుకుంది. రెండు ప్రాజెక్టుల్లో భూమి పోవడంతో చేసేదేం లేక కూలి పనులు చేసుకుంటున్నాడు.

ఈమె పేరు పాల్వజి భాగ్య. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామం. భాగ్య ఐదు ఎకరాల భూమి కాళేశ్వరం అదనపు టీఎంసీ కోసం చేపట్టిన లింకు‑2 ప్రాజెక్టులో పోయింది. మార్కెట్ రేటు ఎకరానికి రూ.40 లక్షలుంటే ప్రభుత్వం ఎకరానికి రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చింది. కిడ్నీ వ్యాధి బారిన పడ్డ భర్త ట్రీట్​మెంట్ ​కోసం చాలా డబ్బు ఖర్చయింది. గతనెలలో ఆయన చనిపోయాడు. మిగిలిన కొంత డబ్బుతో అప్పులు చెల్లించింది. ఇటు భూమిని కోల్పోయి, అటు భర్త చనిపోయి రోడ్డున పడింది. బతుకుదెరువు లేకుండా పోయిందని.. పాప, బాబును ఎలా సాదాలని ఆమె కుమిలిపోతోంది.

ఈమె పేరు బాసాని పద్మ. భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం అంబట్ పల్లి గ్రామం.  ఈమెకున్న ఆరు ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివించుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి పద్మ ఆరెకరాలను ప్రభుత్వం తీసుకుంది. పరిహారం డబ్బులు.. అప్పులకు, పిల్లల చదువులకు ఖర్చయ్యాయి. ఇప్పుడు ఆమె కూలి పనులకు వెళ్తున్నది.