రోడ్డెక్కిన రైతన్న.. జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు

రోడ్డెక్కిన రైతన్న.. జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు

ధాన్యం  కొనాలంటూ  జిల్లాల్లో  రోడ్డెక్కారు  రైతులు. సర్కార్  తీరుకు నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు  చేస్తున్నారు. వర్షాలకు  వడ్లు  తడిసిపోతున్నాయని  ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు రైతులు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లులు దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ప్రారంభమైన ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ ఆఫీసుల ముందు ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి  మండల వ్యవసాయ అధికారి ఆఫీస్ ముందు టోకెన్ల కోసం బారులు తీరారు రైతులు.తెల్లవారుజామున 4 గంటలకే చలిలో ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. కొందరు నిలబడలేక పొలం పాస్ బుక్కులు , ఆధార్ కార్డులు క్యూలైన్లో  పెడుతున్నారు. 4 రోజుల నుంచి  టోకెన్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.  గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు లేక... మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు రైతులు. 

ధాన్యం కొనుగోళ్ల  కోసం   ఆందోళనకు  దిగుతున్నారు రైతులు. 15 రోజుల  కిందట  కేంద్రాలకు ధాన్యం  తీసుకొచ్చినా  కొనడం లేదని  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు,  మిల్లర్లు  పట్టించుకోవడం లేదని .... హనుమకొండ  - సిద్దిపేట రహదారిపై దర్గాపల్లి గ్రామ  రైతులు  ఆందోళనకు దిగారు.దీంతో భారీగా వాహనాలు  నిలిచి పోయాయి. అన్ని గ్రామాల్లో  కొనుగోళ్లు  ప్రారంభించాలన్నారు.  అధికారులు , మార్కెట్ కమిటీ  చైర్మన్  వచ్చి  రైతులకు నచ్చ చెప్పడంతో  ఆందోళన విరమించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట్  మండలంలో  వరి  కొనుగోలు   చేయాలని  ధర్నా చేశారు రైతులు.  కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో  కామారెడ్డి-  సిరిసిల్ల ప్రధాన రహదారిపై అన్నదాతలు బైటాయించారు. పాత  నిబంధనల ప్రకారం   వడ్లు కొనుగోలు  చేయాలన్నారు  కాంగ్రెస్ నేతలు. కొత్త రూల్స్ పెట్టి   వ్యవసాయాధికారులు  ధాన్యాన్ని  కొనడంలేదేని  రైతులు ఆగ్రహం  వ్యక్తం చేశారు. తాహసిల్దార్  మాజిత్  వచ్చేంతవరకు  ధర్నా చేసి  వినతిపత్రం  అందించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో  వర్షాలకు తడిసి పాడవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.