పరిహారం ప్రకటించి నెలైనా 10 వేలు పడలె

పరిహారం ప్రకటించి నెలైనా 10 వేలు పడలె
  • పరిహారం ప్రకటించి నెలైనా 10 వేలు పడలె
  • లక్షా 30 వేల మంది రైతుల ఎదురుచూపు
  • మార్చిలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం 
  • 1.51 లక్షల ఎకరాలుగానే తేల్చి.. 151 కోట్లు విడుదల 
  • నిధులు రిలీజైనా రైతుల ఖాతాల్లో జమ చేయని సర్కార్​
  • మొత్తంగా రెండు నెలల్లో 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం 

హైదరాబాద్‌, వెలుగు:  అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి నెల దాటినా రైతుల ఖాతాల్లో పైసా పడలేదు. మార్చిలో కురిసిన వానలకు చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అదే నెల 23న ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే సీఎం ప్రకటించిన నెల రోజులకు ఏప్రిల్ 19న పంట నష్టపరిహారం కింద రూ.151.64 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి రెండు వారాలు దాటినా రైతుల ఖాతాల్లో మాత్రం పైసా జమ చేయలేదు. 

జిల్లాల్లో కేసీఆర్ పర్యటన తర్వాత అగ్రికల్చర్ అధికారులు పంట నష్టంపై సర్వే మొదలుపెట్టారు. క్షేత్రస్థాయి సిబ్బందిని రంగంలోకి దించి 32 అంశాలతో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్ సర్వే చేపట్టారు. ప్రతి జిల్లాలో క్లస్టర్ల వారీగా పంట నష్టం లెక్కలు ఏవోలు, డీఏవోల ద్వారా కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్ల నుంచి వచ్చిన వివరాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. ఆ రిపోర్టును అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుకు పంపగా, అందులో భారీగా కోత పెట్టారు. కేవలం లక్షా 51 వేల 645 ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో లక్షా 30 వేల 988 మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించేందుకు రూ.151 కోట్ల 64 లక్షల 55వేలు విడుదల చేస్తూ ఏప్రిల్ 19న జీవో జారీ చేశారు. కాగా, మార్చిలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అప్పట్లో అంచనా వేశారు. ఫీల్డ్ లెవల్ లో సర్వే తర్వాత 2.28 లక్షల ఎకరాలుగా తేల్చగా, అధికారులు దాన్ని 1.51 లక్షల ఎకరాలకు కుదించారు. ఏఈవోలు ఇచ్చిన డేటాలో అధికారులు 75 శాతం కోత పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో జిల్లాలో జరిగిన నష్టంలో పావు వంతు కూడా పరిహారం చెల్లించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.  

ఏప్రిల్ పంట నష్టం తేల్చలే.. 

మార్చిలో కురిసిన వానలకు తోడు ఏప్రిల్ లో పడిన వడగండ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే ఏప్రిల్ లో జరిగిన పంట నష్టాన్ని అధికారులు ఇప్పటి వరకు తేల్చలేదు. క్షేత్రస్థాయి సిబ్బంది ఫీల్డ్ లెవల్ లో సర్వే చేపట్టి, లెక్కలు పంపిస్తున్నా పైస్థాయిలో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఏఈవోలు పంపుతున్న డేటాలో భారీగా కోతలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.