‘భరోసా’కు రైతులు దూరం..సిరిసిల్ల కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన

‘భరోసా’కు రైతులు దూరం..సిరిసిల్ల కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన
  • 9వ ప్యాకేజీ పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు 209 మంది రైతుల నుంచి భూసేకరణ
  •  పైప్​లైన్‌‌‌‌ పనులకు పోను మిగిలిన భూమిని ఆన్​లైన్​లో అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయని అధికారులు 

రాజన్న సిరిసిల్ల,వెలుగు: కాళేశ్వరం 9వ ప్యాకేజీ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ కింద భూమిని కోల్పోయిన రైతులకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతు భరోసా అందడం లేదు. ఈ మేరకు వీర్నపల్లి మండల రైతులు సోమవారం కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ ప్యాకేజీలో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసేందుకు రాయినిచెరువుకు పైప్‌‌‌‌లైన్‌‌‌‌ వేసేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు.

దీనికోసం వీర్నపల్లి మండలంలో సుమారు 209 మంది రైతుల నుంచి రెండు, మూడు గుంటల చొప్పున దాదాపు 15 ఎకరాలు సేకరించారు. ఈ భూమికి పరిహారం కూడా అందింది. కాగా పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు పోగా మిగిలిన భూమిని సర్వే చేసి అప్‌‌‌‌డేట్ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఆ భూమి బ్లాక్‌‌‌‌ అయింది. అప్పటి నుంచి ఆ భూమికి రైతు భరోసా రావడం లేదు. దీనిపై రైతులు అధికారులను ఆరా తీయగా.. మిగిలిన భూమిని సర్వే చేసి అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయకపోవడంతో బ్లాక్ అయి భూభారతిలో కన్పించడం లేదని చెప్పారు.

రైతుభరోసా రాని రైతులు గత రెండు, మూడు రోజులుగా ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నారు. అనంతరం సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిశారు. ఆయన ఆదేశాల మేరకు వీర్నపల్లి రెవెన్యూ ఆఫీసర్లు రికార్డులు సరి చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచే కొందరి భూములు భూభారతిలో కనిపిస్తుండగా.. రెండు రోజుల్లో అందరి భూముల రికార్డులు సరిచేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు.