వడ్లు తెచ్చి నెలైనా కొనలే.. విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు 

వడ్లు తెచ్చి నెలైనా కొనలే.. విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు 

వడ్లు తెచ్చి నెలైనా కొనలే
విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు 
క్వింటా రూ.1,700కే అమ్ముకున్నరు 
జగిత్యాల జిల్లా పొరండ్లలో ఘటన
క్వింటా రూ.1,700కే అమ్ముకున్నరు 
జగిత్యాల జిల్లా పొరండ్లలో ఘటన 

జగిత్యాల రూరల్, వెలుగు : ఐకేపీ సెంటర్ కు వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు.. చివరకు వడ్లను ప్రైవేట్ మిల్లుకు తరలించి అగ్గువకే అమ్ముకున్నారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల ఐకేపీ సెంటర్​లో నెల కింద దాదాపు 300 మంది రైతులు వడ్లు పోశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 64 మంది రైతుల వడ్లు మాత్రమే కోనుగోలు చేశారు. గత నాలుగైదు రోజులుగా లారీలు రాలేదనే కారణంతో కాంటాలు కూడా బంద్​పెట్టారు. పని లేదని హమాలీలు కూడా వెళ్లిపోయారు. దీంతో విసుగు చెందిన కొందరు రైతులు.. గురువారం వడ్లను సంచుల్లో నింపుకొని ప్రైవేట్ మిల్లుకు తీసుకెళ్లి అమ్ముకున్నారు.

క్వింటాకు రూ.2,060 మద్దతు ధర  ఉండగా, తప్పనిసరి పరిస్థితుల్లో రూ.1,700కే విక్రయించారు. విషయం తెలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. మద్దతు ధరకే అమ్ముకోవాలని  రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడిసిపోయాయని, వాటిని ఆరబోసి నెల రోజులుగా సెంటర్​లో పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరదాల కిరాయి కూడా తడిసి మోపెడైందని, ఈ బాధలు భరించలేకనే ప్రైవేట్ కు అమ్ముకుంటున్నామని చెప్పారు. కాగా, డీఎస్ఓ రజినీకాంత్, ఏపీడీ సుధీర్, తహసీల్దార్ నవీన్ సెంటర్ కు చేరుకొని మిగిలిన రైతులతో మాట్లాడారు. వెంటనే లారీలు తెప్పిస్తామని, జూన్ 1 కల్లా వడ్లు మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 

రైతు బతికే పరిస్థితి లేదు

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఉంటలేరు. నెల రోజుల్లో కేవలం 64 మంది వడ్లే కాంటా పెట్టిన్రు. లారీలు వస్తలేవని నాలుగైదు రోజులుగా కాంటాలు బంద్​పెట్టిన్రు. జోకిన వడ్లకు సుత కాపలా కాయాల్సి వస్తున్నది. తూర్పార పట్టిన వడ్లకు కిలోన్నర తరుగు తీస్తున్నరు. రైతు బతికే పరిస్థితి లేదు. 
- మల్లారెడ్డి, పొరండ్ల