రసాయనాలు తగ్గిస్తేనే రైతుకు ఫాయిదా

రసాయనాలు తగ్గిస్తేనే రైతుకు ఫాయిదా

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలు వస్తున్నాయి.1960లో వచ్చిన హరిత విప్లవం తర్వాత సాంప్రదాయక వ్యవసాయం నుంచి రైతులు ఆధునిక సేద్యం వైపు రావడం పెరిగింది. అయితే సాగు విధానంలో కొత్త పద్ధతులు, పోకడలతోపాటే రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం కూడా విపరీతంగా పెరుగుతోంది. దేశంలో రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయి. వ్యవసాయంలో స్వల్పకాలిక లాభాల ఆశ పెరిగి ఎడాపెడా రసాయన ఎరువులు ఉపయోగిస్తుండటంతో భూమిలో అసమతుల్యం ఏర్పడి పంటల్లో పోషక లోపాలు ఏర్పడుతున్నాయి. రైతులకు కూడా పెట్టుబడి ఖర్చు గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది. దీంతో పంట పెట్టుబడికి, దిగుబడులకు మధ్య దూరం పెరిగి నష్టాలు తప్పడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ రసాయనిక అవశేషాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంపై దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయానిది ప్రధాన పాత్ర. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతి పద్ధతులతో మొదలైంది. తర్వాతి కాలంలో అనేక కొత్త విధానాలు, కొత్త పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడినిచ్చే సంకరాలు సాగులోకి వచ్చాయి. పంటలకు వచ్చే తెగుళ్ల నివారణకు వివిధ రసాయనాల వాడకం మొదలైంది. దాంతో ఆగిపోకుండా అధిక దిగుబడి ఆశతో రైతులు వాటికి వచ్చే చీడ పీడల నివారణకు ఎరువులను అధిక మోతాదులో వాడటం మొదలు పెట్టారు. ఇలా గత పదేండ్లలో రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దేశీయంగా రైతులకు తోచినంత రసాయనిక ఎరువులను చల్లుకునే స్వేచ్ఛ ఉంది. అలాంటి స్వేచ్ఛ కల్పించిన ప్రభుత్వాలు.. చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై మాత్రం ఎప్పటికప్పుడు రైతులకు తగిన సూచనలు ఇవ్వడం లేదు. దిగుబడుల కోసం రైతులు ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువుల మీదే ఆధారపడుతున్నారు. వ్యవసాయ శాఖ కూడా భూసార పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడం లేదు. దేశంలో అత్యధికంగా రసాయనాలను పొలాల్లో కుమ్మరించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. 2019–20 ఏడాదిలో జాతీయ స్థాయిలో హెక్టారు పంటకు రైతులు సగటున133.44 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. అయితే జాతీయ సగటు మించి బిహార్​లో 245 కిలోలు, తెలంగాణలో 206 కిలోలు, ఆంధ్రప్రదేశ్​లో 196 కిలోల చొప్పున రసాయనిక ఎరువులు వాడారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే 20.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం అని వ్యవసాయ శాఖ కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. దేశంలో 2015 – 16 లో 5.16 కోట్ల టన్నుల రసాయనిక ఎరువులు చల్లితే, 2019 –- 20 నాటికి అది 5.98 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ స్థాయిలో రసాయనాల వినియోగం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతింటోంది. అంతేకాకుండా పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. రసాయనిక ఎరువుల వాడకం ఇదే స్థాయిలో పెరిగితే 2040 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించి తీవ్ర దుష్పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

విదేశాల నుంచి దిగుమతి..

దేశవ్యాప్తంగా ఎరువుల వినియోగం 5.98 కోట్ల టన్నులు ఉంటే అందులో కోటి 37 లక్షల టన్నులు విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. డై అమ్మోనియా ఫాస్పేట్(డీఏపీ)ని కెనడా, రష్యా, అమెరికా, జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2015 – 20 మధ్యకాలంలో రసాయన ఎరువుల వాడకం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెరగగా.. కాశ్మీర్​లో 61 శాతం, కేరళలో 58 శాతం తగ్గింది. సిక్కిం రాష్ట్రం సేంద్రియ సేద్యంలో ముందుకు పోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.2007 – 08 ఏడాదిలో ఎరువుల తయారీ పద్దు కింద కేంద్రం రూ.32,490 కోట్లు కేటాయిస్తే2021 -– 22లో రూ.1.8 లక్షల కోట్లకు చేరింది. సాధారణంగా పంటలకు 4:2:1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను అందించాల్సి ఉండగా అత్యధిక దిగుబడి ఆశతో స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటిని దేశ వ్యాప్తంగా 8:2:9 నిష్పత్తిలో వాడుతున్నట్లు తెలుస్తోంది. రైతులకు ఈ అంశంపై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, ఎరువుల వినియోగాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం, రైతులకు సరైన మార్గదర్శనం చేసే విధానాలు లేకపోవడం  వ్యవసాయ రంగానికి సమస్యగా మారింది. పర్యావరణ హిత వ్యవసాయం- భూమిలోని స్థిరత్వాన్ని, భూమిలో ఉండాల్సిన జీవ సమతుల్యాన్ని పెంచుతుంది. కానీ ప్రస్తుతం వ్యవసాయంలో స్వల్పకాలిక లాభాల ఆశ పెరిగి ఎడాపెడా రసాయన ద్రావకాలను ఉపయోగిస్తుండటంతో భూమిలో అసమతుల్యం ఏర్పడి పంటల్లో పోషక లోపాలు ఏర్పడుతున్నాయి.

సేంద్రియ సాగు మేలు..

రసాయనిక సేద్యానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వాతావరణం కాలుష్యాన్ని నివారిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, నాణ్యమైన దిగుబడులు సాధించడమే సేంద్రీయ వ్యవసాయ ముఖ్య ఉద్దేశం. అయితే వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువులతో పాటు నాణ్యమైన విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. రోగాలను తట్టుకుని శక్తి గల మెరుగైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం వల్ల రైతులకు అన్ని విధాలా ప్రయోజనం ఉంటుంది. సరైన సమయంలో విత్తనాలు వేసుకోవడం, సక్రమ నీటి యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్యం అంతర పంటల సాగు, పంట మార్పిడి, పురుగుల నివారణకు వృక్ష సంబంధ పదార్థాలు వాడటం వంటి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా సుస్థిర దిగుబడులు సాధించవచ్చు. రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేయడానికి ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహం ఉండాల్సిన అవసరం ఉంది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించేలా ప్రభుత్వం రైతులను చైతన్య పరచాలి. వ్యవసాయంలో మేలైన సాగు పద్ధతులు, చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వాడకం, వాటి తయారీ తదితర అంశాలను రైతులకు వివరించాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలి. 

ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు..

సేంద్రియ సాగును పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రస్తుత సహజ ఎరువుల రకాలు సరిపోవు, పశువుల పేడ, కంపోస్టు పంటల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు మొత్తం కలిపినా ఒక సంవత్సరంలో పంటలకు అవసరమయ్యే పోషకాలను అందించలేవు. 2025 నాటికి 4.5 కోట్ల టన్నుల పోషకాలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేంద్రియ వనరుల పోషకాలు 50 లక్షల టన్నులకు మించవు. 2025 నాటికి 78 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండవచ్చని అంచనా. కాబట్టి దశల వారీగా సేంద్రియ సాగును ప్రోత్సహించాలి. మూడొంతులు ఉన్న మెట్ట, అటవీ, కొండ, గిరిజన ప్రాంతాల్లో రసాయన ఎరువుల వాడకం ఇప్పటికీ తక్కువే. అక్కడ జరుగుతున్నది సేంద్రియ సాగే. కొన్ని సూచనలు, సాగులో మార్పులతో వాటిని సేంద్రియ ఉత్పత్తులుగా విక్రయించవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థ, దవాఖానలు, మధ్యాహ్న భోజన పథకం, రైల్వేల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తులను ముందుగా పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

:: డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ