సాగుకు డీజిల్‌‌‌‌‌‌‌‌ దెబ్బ

సాగుకు డీజిల్‌‌‌‌‌‌‌‌ దెబ్బ
  • ట్రాక్టర్లు ఉన్నా సాగని దుక్కి పనులు
  • సాగుబడికి ఆదిలోనే కష్టాలు  
  • ఆందోళనలో రైతన్నలు

నిజామాబాద్, వెలుగు: ఎప్పుడూ విత్తనాలు, ఎరువుల కొరతతో ఇబ్బంది పడే రైతులకు ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో  కొత్త సమస్య వచ్చింది.  సాగు కోసం అన్నీ రెడీ చేసుకున్నా..  దుక్కి సమయంలోనే డీజిల్‌‌‌‌‌‌‌‌ కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 5,09,753 ఎకరాలు కాగా, కామారెడ్డి జిల్లాలో 3 లక్షల ఎకరాలున్నాయి. సాగు పనుల్లో దాదాపు 99 శాతం రైతులు ట్రాక్టర్లతోనే దుక్కి దున్నుతారు. అయితే జిల్లాలో డీజిల్‌‌‌‌‌‌‌‌ కొరతతో సగానికి పైగా పనులు దుక్కి దశలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

డీజిల్‌‌‌‌‌‌‌‌ దొరకడం లేదు.. 

వానాకాలంలో సాగుబడి అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో డీజిల్‌‌‌‌‌‌‌‌ కొరతతో ఆదిలోనే పనులు ఆగిపోయాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌కు ఎరువులు, విత్తనాల కోసం వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ పనుల్లో దుక్కి దున్నేందుకు చాలా వరకు ట్రాక్టర్లనే వినియోగిస్తారు. ఇందుకు ఉమ్మడి జిల్లాకు 90 లక్షల లీటర్ల డీజిల్‌‌‌‌‌‌‌‌ అవసరం ఉంది. డీజిల్‌‌‌‌‌‌‌‌ షార్టేజ్‌‌‌‌‌‌‌‌తో రైతులు ఇప్పటి వరకు దుక్కి దున్నడం లేదు.  

రోజుకు 15 లక్షల లీటర్లు...

ఉమ్మడి జిల్లాలో సుమారు 315 వరకు పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. జిల్లాకు ప్రతి రోజు 15 లక్షల లీటర్ల డీజిల్, 12 లక్షల లీటర్ల పెట్రోల్  వినియోగిస్తుంటారు. పెట్రో ధరల స్థిరీకరణలో వ్యత్యాసంతో ధర పెరగడం వల్ల డీలర్లకు లీటర్ ధరకు రూ.25 నష్టం వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్, షెల్, భారత్ పెట్రోల్ (బీపీ), నైరా, జియో కంపెనీలు డీజిల్‌‌‌‌‌‌‌‌ సరఫరాను నిలిపివేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే మందస్తు చెల్లింపులతో డీజిల్‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేస్తున్నాయి. అయితే  సరఫరాకు 72 గంటల సమయం పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌ల్లో డీజిల్‌‌‌‌‌‌‌‌ దొరకడం లేదు. దీంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. 

సాగుకు ప్రత్యేకంగా సరఫరా చేయాలే

దుక్కి దున్ని విత్తనాల నాటే సమయంలో డీజిల్‌‌‌‌‌‌‌‌ షార్టేజ్‌‌‌‌‌‌‌‌తో సాగుపై ప్రభావం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు డీజిల్ ప్రత్యేక కోటా ఇవ్వలే. ప్రస్తుతం జిల్లాలో డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

- జి.గంగారెడ్డి, రైతు, అంకాపూర్​  

బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నరు

డీజిల్ షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతోంది. కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. రైతులు విత్తనాలే కాదు. డీజిల్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కొనాల్సిన వస్తోంది.  

- వెంకటేశ్, రైతు, కంఠం