
- శివ్యంపేట, నర్సాపూర్ మండలల్లో జోరుగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు
- సర్కారు అమ్దానీకి గండికొడుతున్న రియల్టర్లు
- వీటికి నాలా కన్వర్షన్లు,రూల్స్ ఉండవు
- రోడ్ల కోసం కుంటలు, ఫారెస్ట్ భూముల కబ్జా
- మత్స్యకారులు, ఉపాది కూలీలకు ఇబ్బందులు
మెదక్ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో రియల్టర్లు కొత్త దందా షురూ చేశారు. ఫామ్‌ల్యాండ్ పేరుతో గుంటల లెక్కన భూములు అమ్ముతున్నారు. పర్మిషన్లు లేకుండానే కాంపౌండ్‌వాల్స్ నిర్మిస్తున్నారు. రూల్స్ పాటించకుండా సర్కార్ ఆమ్దానీకి గండిగొడుతున్నారు. ఈ భూములకు సమీపంలోని కుంటలు, ఫారెస్ట్ భూములు కబ్జా చేసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.
రూల్స్‌కు విరుద్ధంగా వెంచర్లు
శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లో రూల్స్‌కు విరుద్ధంగా ఫామ్‌ల్యాండ్ వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు శివ్వంపేట మండలం కొంతన్‌పల్లి పరిధిలో దాదాపు 80 ఎకరాలు, చిన్నగొట్టిముక్కుల పరిధిలో సుమారు 100 ఎకరాలు, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో దాదాపు 50 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్లాట్లు అమ్మాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి (నాలా కన్వర్షన్ )గా మార్చుకోవాలి. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో అప్లై చేసుకొని, దానికి సంబంధించిన ఫీజు చెల్లించాలి. అప్పుడే నాలా కన్వర్షన్జరుగుతుంది. అయితే ఇదేమీ లేకుండానే ఫామ్‌ల్యాండ్‌ను గుంటకు రూ.8 లక్షలు, రూ.10 లక్షలకు లెక్కన అమ్ముతున్నారు. ఈ క్రమంలో కొంతన్‌పల్లి పరిధిలోని కరీంకుంట, పక్కనే ఉన్న వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్ పరిధిలోని మాసాని కుంట, గుల్లకుంటలు కబ్జాకు గురయ్యాయి. కొన్ని రోజుల కింద వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్, శివ్వంపేట మండలం కొంతన్‌పల్లి సరిహద్దులో ఉన్న ఫారెస్ట్ కందకాన్ని పూడ్చివేసి రోడ్డు నిర్మించారు. దీనిని కొంతన్‌పల్లి సర్పంచ్, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి రోడ్డు పనులకు వినియోగిస్తున్న డోజర్‌ను స్వాధీనం చేసుకుని జేసీబీతో రోడ్డు తొలగించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఫామ్‌ల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, పనులకు వెళ్లేందుకు ఉపాధి కూలీలు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
శివ్వంపేట మండలం కొంతన్ పల్లి శివారులో ఫామ్‌ల్యాండ్ పేరుతో రియల్ఎస్టేట్వ్యాపారులు ఫారెస్ట్, ప్రభుత్వ భూమి కబ్జా చేస్తూ, ఎలాంటి పర్మిషన్‌లేకుండా బిల్డింగ్‌లు, రోడ్లు నిర్మిస్తున్నారని కలెక్టర్‌కు ఇటీవల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన డీపీవో సాయిబాబా, ఎంపీవో తిరుపతిరెడ్డి ఫామ్ల్యాండ్వెంచర్లను పరిశీలించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న వెంచర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వారు తెలిపారు.
చేపలు పట్టేందుకు పోనిస్తలేరు
మా ఊరి శివారులోని కుంటలో ప్రభుత్వం సప్లై చేసిన చేపపిల్లలు వదిలినం. చేపలు పట్టి అమ్ముకుందామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుంటల దగ్గరకు పోనిస్తలేరు. సెక్యూరిటీ వాళ్లను పెట్టి అడ్డుకుంటున్రు.. పోలీసులతో కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్రు.. శంకర్, మత్స్యకారుడు, కొంతన్ పల్లి ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. ఫామ్‌ల్యాండ్ వెంచర్లు చేస్తున్న రియల్ఎస్టేట్వ్యాపారులు మూడు నెలల కింద గ్రామంలోని కుంటలను కబ్జా చేశారు. 337 సర్వే నంబర్లు ఉన్న ప్రభుత్వ భూమి కూడా కబ్జా అయింది. పర్మిషన్ లేకుండా రోడ్లు, కాంపౌండ్ వాల్లు, బిల్డింగ్ లు కడుతున్నరు. సర్వే చేసి, యాక్షన్ తీసుకోవాలని ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు.
–శ్రీనివాస్ గౌడ్, కొంతన్‌పల్లి సర్పంచ్
మా దృష్టికి వచ్చింది
ఫామ్‌ల్యాండ్ వెంచర్లకు ఎలాంటి పర్మిషన్లు లేవు. కుంటలు కబ్జా చేశారని మా దృష్టికి వచ్చింది. సర్వే చేసి కబ్జా చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. రోడ్లు, బిల్డింగ్‌లు నిర్మిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాస్‌చారి, శివ్వంపేట తహసీల్దార్