పొలాలు గుంజుకున్నరు.. ఫ్యాక్టరీలు కడ్తలేరు

పొలాలు గుంజుకున్నరు.. ఫ్యాక్టరీలు కడ్తలేరు

సంగారెడ్డి, వెలుగు : పారిశ్రామికాభివృద్ధి కోసం కంపెనీలకు సర్కారు భూములు కేటాయిస్తున్నా ఫ్యాక్టరీలు మాత్రం కట్టడం లేదు. పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని వ్యవసాయ భూములను ఇస్తే.. అటు ఉద్యోగాలు రాక ఇటు ఉన్న భూములు పోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో టీఎస్ఐపాస్ ద్వారా వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలకు భూమి కేటాయించారు. దాదాపు 200 ఎకరాలను ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే అప్పగించింది. అయితే ఏండ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీలు నెలకొల్పడం లేదు. దీంతో రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు.

రెండేళ్ల తర్వాత వచ్చిన్రు

జిన్నారంలోని సర్వే నంబర్ 1లో 36 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి టీఎస్ఐపాస్ కి రెండేళ్ల క్రితం బదలాయించారు. ఇటీవల ఈ భూమిని ఓ సంస్థకు కేటాయించారు. సంస్థ ప్రతినిధులు స్థలం స్వాధీనం చేసుకునేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కాకుండా ఇతర ప్రయోజనాలకు తమ భూములను వాడుకుంటున్నారని ఆందోళనకు దిగారు. వారం పాటు ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో సంస్థ ప్రతినిధులు వారం క్రితం పోలీసు పహారా మధ్య స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే శుక్రవారం కొందరు బాధిత రైతులు ఆందోళనకు దిగి బడా పారిశ్రామికవేత్తల తీరును వ్యతిరేకించారు. ఫ్యాక్టరీలు కట్టకుండా భూములు స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడితే ఫ్యాక్టరీలైనా కట్టండి లేదా మా భూములు మాకివ్వాలని కోరారు. 

నాలుగేండ్లయినా పనులు షురూ కాలే

జిన్నారం మండలం శివనగర్ లో ఎల్ఈడీ పార్క్ కోసం 114 సర్వే నంబర్ లో 118 ఎకరాల అసైన్డ్​స్థలాన్ని కేటాయించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో కొండలు తొలచి గుంతలు పూడ్చి నాలుగేళ్లు రహదారి పనులు చేశారు. ఇక్కడ పలు సంస్థలకు రూ.2,700 స్క్వేర్ మీటర్ చొప్పున స్థలాన్ని కేటాయించారు. స్థలాలు పొంది రెండేళ్లు అవుతున్నా నేటికీ నిర్మాణ పనులు షురూ కాలేదు. ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే సమీపంలోని పది గ్రామాల ప్రజలు, యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు. అలాగే గడ్డపోతారంలోని 27 సర్వే నంబర్ లో చిన్నతరహా పరిశ్రమలకు నూ భూకేటాయింపులు చేయగా అక్కడా పనులు మొదలుకాలేదు. 

హెలికాప్టర్ విడిభాగాల తయారీ ఏమైంది?

మంగంపేట సర్వే నంబర్ 55లో ఏడాదిన్నర క్రితం 22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ హెలికాప్టర్ విడిభాగాల సంస్థకు కేటాయించారు. కేటాయింపులు జరిగిన టైంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తారని చెప్పినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎలాంటి పనులు చేయడం లేదు. ఏండ్లపాటు భూములను ఖాళీగా ఉంచుతున్న సర్కారు ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా ఇతర అవసరాలకు వినియోగించవచ్చన్న అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కాకుండా ఇతర అవసరాలకు భూములను వాడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.

మూడెకరాలు పోయాయి

15 ఏండ్ల క్రితం సర్వే నంబర్ 1లో సర్కారు మూడు ఎకరాల ఇచ్చింది. ఆ భూమిని ఫ్యాక్టరీ కోసమని అధికారులు గుంజుకున్నరు. పరిశ్రమలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తయని అనుకున్నం. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టరని అందరూ అనుకుంటున్నారు. అందుకే మా భూమి మాకే ఇవ్వాలి. ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం.

– రాళ్లకత్వ సాయిలు, బాధిత రైతు

భూములిచ్చి ఆదుకోవాలె

ఉన్న రెండెకరాల పొలం పోయింది. భూమి లేక వ్యవసాయం చేయలేకపోతున్నాం. మాకు ఉపాధి పోయి.. మా పిల్లలకు ఉద్యోగాలు లేక దీనావస్థలో ఉన్నాం. ఫ్యాక్టరీలు కట్టకుండా ఏళ్లకొద్ది కాలయాపన చేస్తున్నరు. మా భూములు మాకిచ్చి ఆదుకోవాలి. 

–  కోరబోయిన పోచయ్య, రైతు