12,769 గ్రామాలకు 6,205 ‍జీపీల్లోనే ఎఫ్ఏలు

12,769 గ్రామాలకు 6,205 ‍జీపీల్లోనే ఎఫ్ఏలు
  • కొత్త జీపీల్లో నియమించని ప్రభుత్వం
  • ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ కు రెండు, మూడు గ్రామాల బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 6,564  గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నాలుగేండ్ల క్రితమే కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినప్పటికీ ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాలకుగాను 6,205 ‍జీపీల్లో మాత్రమే పూర్తిస్థాయిలో ఫీల్డ్  అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నారు. మిగతా గ్రామ పంచాయతీలకు ఎఫ్ఏలను నియమించకపోవడం, పొరుగూరిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉండడంతో పనుల విషయంలో ఉపాధి హామీ కూలీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఖాళీలు భర్తీ చేస్తే 6,564 కుటుంబాలకు ఉపాధి   

2018లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యంతోపాటు తండాలు, గూడేలను జీపీలుగా గుర్తించాలనే ఉద్దేశంతో 4,383 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న 8,386 ఉమ్మడి జీపీల్లో కేవలం 7,305 మంది మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తుండేవారు. అప్పటికే సుమారు వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సస్పెన్షన్లు, టర్మినేషన్ లతో గత నాలుగేండ్లలో మరో వెయ్యి మంది విధులకు దూరమయ్యారు. మొత్తంగా ప్రస్తుతం 6,205 మంది మాత్రమే డ్యూటీలో ఉన్నారు. ఖాళీగా ఉన్న 6,564 పోస్టుల్లో సీనియర్ మేట్లు, అర్హులను తీసుకుంటే వారందరికి స్థానికంగా ఉద్యోగం అవకాశం లభించనుంది. 

సెక్రటరీలపై పనిభారం

2020 మార్చిలో సమ్మె చేశారని ఫీల్డ్ అసిస్టెంట్లను దూరం పెట్టిన సర్కార్ 2022 ఆగస్టులో తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. రెండేండ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవటంతో ఉపాధి హామీ పనుల భారం సెక్రటరీలపై పడింది. రెండేండ్ల తర్వాత వారిని తీసుకున్నప్పటికీ.. అన్ని గ్రామాల్లో వారు లేకపోవడంతో కొన్ని చోట్ల ఈజీఎస్ పనులను పంచాయతీ సెక్రటరీలే చూసుకోవాల్సి వస్తోంది. కొత్త జీపీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమిస్తే వీరిపై పనిభారం తగ్గే అవకాశం ఉంది.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలకు కలిపి ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఊరికో ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల చొప్పున బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారు పూర్తిస్థాయిలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించలేకపోతున్నారు. ఎక్కువ గ్రామాలు ఉండడంతో వారిపై పనిభారం కూడా పెరుగుతోంది.