SC,ST కేసులను త్వరగా పరిష్కరించాలి ..ఉద్యోగుల ప్రమోషన్లలో రోస్టర్ విధానం అమలు చేయాలి

SC,ST కేసులను త్వరగా పరిష్కరించాలి ..ఉద్యోగుల ప్రమోషన్లలో రోస్టర్  విధానం అమలు చేయాలి
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ములుగు/భూపాలపల్లి రూరల్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్  చైర్మన్  బక్కి వెంకటయ్య ఆదేశించారు. బుధవారం ములుగు. జయశంకర్​ భూపాలపల్లి కలెక్టరేట్​లలో కలెక్టర్లు బోర్ఖడే హేమంత్  సహదేవరావు, రాహుల్ శర్మ, ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్  రాంనాథ్  కేకన్ తో కలిసి అట్రాసిటీ కేసులు, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై రివ్యూ చేశారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్  ప్లాన్  నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. నిధులు దుర్వినియోగమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. డీవీఎంసీ సమావేశాల్లో మూఢ నమ్మకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. 

ఉద్యోగుల ప్రమోషన్లలో రోస్టర్  విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. హత్య, అత్యాచారం కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను పరిహారంతోనే సరిపెట్టకుండా, పునరావాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. కమిషన్  సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్  భట్, అడిషనల్​ కలెక్టర్  సంపత్ రావు పాల్గొన్నారు.