చిత్తూరు జిల్లా గంగవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న హరీష్, యుగంధర్ బెంగళూర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి తిరుపతి బయలుదేరారు.
ఈ క్రమంలో పలమనేరు దగ్గర బెంగళూరు-తిరుపతి జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందున్న కంటైనర్ సడెన్ బ్రేక్ వేయడంతో కారు వెనకనుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్, యుగంధర్ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
