తండ్రీకొడుకును.. బలిగొన్న ఇసుక లారీ

తండ్రీకొడుకును..  బలిగొన్న ఇసుక లారీ

మానకొండూరు/వీణవంక, వెలుగు: కరీంనగర్​జిల్లా మానకొండూరు మండలంలోని రంగపేట స్టేజీ  వద్ద సోమవారం రాత్రి ఇసుక లారీలు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ, కొడుకు చనిపోయారు. ఆటోను ముందుగా ఒక లారీ ఢీకొట్టి వెళ్లగా.. వెనకాలే వస్తున్న మరో లారీ వారి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. స్థానికుల కథనం ప్రకారం.. వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి, మొగిలి(40) దంపతులకు కొడుకు శివసాయి(11)తో పాటు  15 రోజుల పాప ఉంది. జ్యోతి గ్రామంలో సీఏగా పని చేస్తుండగా, మొగిలయ్య ఆటో డ్రైవర్. జ్యోతికి కరీంనగర్ లోని హాస్పిటల్ లో చేసిన సిజేరియన్ ఫెయిలైనట్లు గుర్తించిన డాక్టర్లు హైదరాబాద్ తరలించారు. 

అక్కడ మరోసారి ట్రీట్ మెంట్ తీసుకుని మూడు రోజుల క్రితమే కరీంనగర్ లోని బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం సాయంత్రం తన భార్య, బిడ్డను వేరొక వాహనంలో మామిడాలపల్లికి పంపి..మొగిలి తన కొడుకు శివసాయితో కలిసి ఆటోలో బయల్దేరారు. ఈ క్రమంలోనే మానకొండూరు మండలంలోని రంగపేట స్టేజీ  వద్ద అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో మొగిలి, శివసాయి  కిందపడ్డారు. వెనకాలే వస్తున్న మరోలారీ పై నుంచి వెళ్లడంతో చనిపోయారు.  ప్రమాదవార్తను తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, మామిడాలపల్లి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. 

గతంలో లలితాపూర్ వద్ద ఇసుక లారీ ఢీకొని రైతు చనిపోయాడని, ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలని, ప్రమాదానికి కారణమైన లారీల డ్రైవర్లను, ఓనర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని ధర్నాకు దిగారు.  ఆందోళన విషయం తెలుసుకున్న  బీజేపీ నేతలు ఈటల  రాజేందర్​,  ఆరెపల్లి మోహన్​ ఆందోళనకారులతో మాట్లాడారు.