రైలు వస్తుంది నాన్నా అని అరుస్తున్నా వదల్లేదు.. పోతూ పోతూ నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి..

రైలు వస్తుంది నాన్నా అని అరుస్తున్నా వదల్లేదు.. పోతూ పోతూ నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి..

నలుగురు చిన్న పిల్లలు.. అందరూ మగపిల్లలే. చిన్నోడికి మూడేళ్లు. పెద్దోడికి 9 ఏళ్లు. అందరికీ చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిపించాడు తండ్రి. రైల్వే ట్రాక్ పై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. పాపం లోకం అంటే తెలియని.. చావు బతుకులు చూడని ఆ పసిపిల్లలు నాన్న వేలు పట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడికో.. ఎందుకో తెలియని అమాయకత్వంలో. సడెన్ గా రైలు కూత.. మృత్యువు తరుముకొస్తున్నట్లు వేగంగా రైలు వస్తుంటే.. పిల్లలను గట్టిగా పట్టుకున్నా తండ్రి. రైలు వస్తుంది.. వదిలెయ్ నాన్నా.. అని గుండెలు పగిలేలా అరిచినా వదలకుండా తను చనిపోతూ పిల్లలను కూడా పొట్టనపెట్టుకున్నాడు ఓ తండ్రి. గుండెలు పగిలిపోయే ఈ వార్త ఢిల్లీ సమీపంలో ఫరీదాబాద్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన మనోజ్ మహతో (45) భార్యపై అనుమానంతో గొడవ పడి ఇంగినుంచి బయటకు వచ్చాడు. నలుగురు పిల్లలు పవన్ (10), కరూ(9), మురళి(5), చోటు(3) లను పార్క్ కు తీసుకెళ్తానని చెప్పి పిల్లలతో కలిసి బయల్దేరాడు. కానీ పార్కుకు వెళ్లకుండా పిల్లలకు కావాల్సినవి కొనిపెట్టి రైల్వే ట్రాక్ పైకి తీసుకెళ్లాడు. బీహార్ కు చెందిన మనోజ్.. ఫరీదాబాద్ లో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. 

ఓ గంట పాటు రైల్వే ట్రాక్ కు దగ్గర ఫ్లై ఓవర్ కింద వెయిట్ చేశారు. ట్రైన్ వస్తుందని తెలిసి నలుగురిని ట్రాక్ పైకి తీసుకెళ్లాడు. రైలు సమీపించే కొద్ది పిల్లంలదరినీ గట్టిగా పట్టుకున్నాడు. రైలు వస్తుంది నాన్నా అని అరిచినా.. ఏడిచినా వదల్లేదు. చివరికి ట్రైన్ కింద పడి చనిపోయారు. భార్యపై కోపం ఉంటే.. జీవితంపై విరక్తి ఉంటే తను చావాల్సింది కానీ.. ముక్కుపచ్చలారని చిన్నారులను పొట్టనపెట్టుకోవటం చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 


గౌట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్ పాల్ చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై నుంచి వస్తున్న ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకున్నారని.. ఒకేసారి అందరూ రైలు చక్రాల కింద నుజ్జు నుజ్జు అయ్యారని తెలిపారు. 

ఈ ఘటన జరిగిన తర్వాత లోకో పైలట్ బల్లాబ్ఘర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ట్రాక్ పైన ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయింది మనోజ్ అని పోలీసులు గుర్తించారు. జేబులో ఉన్న అడ్రస్ బుక్ లో ఉన్న భార్య నంబర్ కు ఫోన్ చేసి వివరాలు అందించారు. 

అయితే తన భర్త పిల్లలను పార్కుకు తీసుకెళ్లాడని.. కాసేపట్లో వస్తాడని మనోజ్ భార్య ప్రియ చెప్పింది. ఆధార్ కార్డు గురించి చెప్పగా ఘొళ్లున ఏడుస్తూ కుప్పకూలింది. స్పాట్ లో భర్త, పిల్లల చెల్లాచెదురైన మృతదేహాలను చూసి కళ్లు తిరిగి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. భర్త పిల్లలు ఒకేసారి చనిపోవడంతో ఒంటిరిదాన్ని అయ్యానని ఆమె రోదన వర్ణనాతీతం అని కుటుంబసభ్యులు తెలిపారు.