మద్యం మత్తులో కొడుకును గొడ్డలితో నరికిండు

V6 Velugu Posted on Oct 17, 2021

శాయంపేట, వెలుగు:  మద్యం మత్తులో కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన రేగూరి పాపిరెడ్డి, అతని కొడుకు రవీందర్​రెడ్డి(34) ఒకే ఇంట్లో ఉంటున్నారు.  రవీందర్​రెడ్డికి పెండ్లై  ఒక కొడుకు ఉన్నాడు.  భార్య సునీతతో గొడవ జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. పాపిరెడ్డి భార్య గతంలో ఆత్మహత్య చేసుకుంది. దాంతో తండ్రీకొడుకులిద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. దసరా సందర్భంగా ఇద్దరూ మద్యం తాగి గొడవకు దిగారు. మాటామాటా పెరిగడంతో పాపిరెడ్డి గొడ్డలితో కొడుకు తలపై నరికాడు. రవీందర్​రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.  రవీందర్​రెడ్డి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్​కుమార్​ చెప్పారు. 

కొడుకు చేతిలో తండ్రి హతం 
మెదక్/పెద్ద శంకరంపేట, వెలుగు: కుటుంబ తగాదాలతో తండ్రిని కొడుకు కర్రతో కొట్టి హత్య చేశాడు. ఎస్సై నరేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి గ్రామానికి చెందిన రోమాల సాయిలు(52), సువర్ణ దంపతుల కొడుకు అనిల్(28). ​కొంతకాలంగా అనిల్​ హైదరాబాద్​లో ఉంటున్నాడు. దసరా పండుగ కోసం గ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. సాయిలు తలపై అనిల్​ కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.  సాయిలు భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Tagged murder, alcohol intoxication, Hanumakonda, shyampeta, father killed his son

Latest Videos

Subscribe Now

More News