ఎం.ఎస్. స్వామినాథన్.. దేశానికి అన్నం పెట్టిండు

ఎం.ఎస్. స్వామినాథన్..   దేశానికి అన్నం పెట్టిండు

భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ మృతికి రైతులోకం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది. ఇతను 1925 ఆగస్ట్ 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, రైతులు, రైతు కూలీలు పెద్దదిక్కును కోల్పోయారు. జీవితాంతం సస్యరక్షణ, ఆకలి, పేదరికం, వ్యవసాయ ఉత్పత్తులు, వాటి నాణ్యత, కొత్త వంగడాలను కనుగొనడం వంటి అనేక అంశాలపై పోరాడిన గొప్ప భారత వ్యవసాయ శాస్త్రవేత్త.

స్వాతంత్ర్యానికి ముందు బెంగాల్ క్షామంలో తిండిలేక 30 లక్షల మంది మరణించడం చూసి వీరు తీవ్రంగా కలత చెందారు. దీంతో దేశంలో ప్రజలకు సరిపోను నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్న సంకల్పంతో వ్యవసాయ పరిశోధనలు మొదలుపెట్టారు. ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్ కనిపెట్టిన మెక్సికన్ గోధుమ రకాలను భారతదేశంలో ప్రవేశపెట్టి దేశంలో ఉన్న  క్షామాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఇతని కృషికి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక అవార్డులు, రివార్డులు సొంతమయ్యాయి. రామన్ మెగసెసె అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా గాంధీ శాంతి బహుమతితోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు వీరికి డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1972–-19 వరకు ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్​గా పని చేశారు. 

ఆహార భద్రతపై దృష్టి

స్వామినాథన్ ప్రధానంగా ఆహార ఉత్పత్తులు పెంచాలని, వాటిలో పోషక విలువలు సమృద్ధిగా ఉండాలని, దేశానికి ఆహార భద్రతను కల్పించాలని కోరారు. ఆహార ఉత్పత్తి, ఉత్పత్తిదారులకు రావాల్సిన లాభాలు సముచితంగా ఉండాలనేవారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేలా విధానాలు ఉండాలని ప్రతిపాదించారు. కోస్తా ప్రాంతాల, అటవీ ప్రాంతాల గిరిజన రైతులకు ప్రత్యేక సహాయ సహకారాలు అందించాలని, వారు పండించే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా పంటల ఉత్పత్తిని, వాటి నాణ్యతను పెంచాలని నివేదించారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు దిగుమతులు నిలిపివేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

పంటలకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించేందుకు ఎకొలాజికల్ ఫౌండేషన్ పరిరక్షించి, పెంపొందించడానికి స్థానిక సంస్థల కమిటీలను ఏర్పర్చి సశక్తీకరించాలని ఆయన ప్రతిపాదించారు. ఆహార భద్రత కోసం మధ్యస్త వ్యూహాన్ని రూపొందించాలనేవారు. రైతుల పెట్టుబడి తగ్గేలా, వారు పండించిన పంటల ఉత్పత్తులకు లాభసాటి ధర వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని, రైతుల పెట్టుబడులకు వడ్డీరహిత రుణాలివ్వాలని, సమర్థవంతమైన వ్యవసాయం కోసం పర్యావరణాన్ని రక్షించేందుకు స్థానిక సంస్థల ప్రాధాన్యత పెంచాలన్నారు.

పెట్టుబడులు తగ్గించేందుకు భూసార పరీక్షలు నిర్వహించాలని, ఎరువుల ధరలను నియంత్రించాలని, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులో తేవాలని కోరారు. పంట పండిన తర్వాత కావాల్సిన మార్కెట్ సదుపాయాలు కల్పించాలని, రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు కల్పించాలని, డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా రైతులకు మార్కెట్ వెసులుబాటు కల్పించాలని, మార్కెట్ వ్యవస్థను క్రమబద్ధీకరించాలన్నారు. 

వ్యవసాయ బిల్లులను సమర్థించారు.

గతంలో జరిగిన రైతుల ఉద్యమాలకు ప్రపంచ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్  మద్దతును స్వామినాథన్ వ్యతిరేకించారు. వ్యవసాయ మార్పుల కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఖలిస్థాన్ ఉద్యమకారులు ఒక టూల్ కిట్​ను తయారు చేయడాన్ని వ్యతిరేకించారు. ఇది పెద్ద దేశద్రోహమని, భయంకర పరిణామమని వర్ణించారు. వ్యవసాయాన్ని ఓట్ల కోసం, రాజకీయాల కోసం వాడుకోకూడదని కోరారు. 

స్వామినాథన్​ బాటలోనే..

స్వామినాథన్ నివేదికల ఆధారంగానే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ఆవిష్కరించింది. అందుకే రూ.6లక్షల కోట్ల నుంచి నాబార్డుకు రూ.20 లక్షల కోట్ల పంట రుణాలను బడ్జెట్​లో ప్రతిపాదించారు. కేంద్రం రైతులకు 3 శాతం వడ్డీకే ఈ రుణాలను అందిస్తుంది. ఆత్మనిర్భర్ ద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించింది.  రైతులకు లాభసాటి ధరలు కల్పించేందుకు మార్కెట్ ను క్రమబద్ధీకరించారు. ఈనామ్ తీసుకురావడమే కాకుండా, ఎక్కడైనా పంటలు స్వేచ్ఛగా అమ్మడం, వివిధ రాష్ట్రాల మధ్య చెక్ పోస్టులను ఎత్తివేయడం వంటివి చేపట్టారు. స్వామినాథన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ​ దేశానికి అన్నం పెట్టిన శాస్త్రవేత్త స్వామినాథన్ ను మరువలేకపోతున్నాం.

అనేక పరిశోధనలు

1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నాచురల్ రిసోర్స్ సంస్థకు అధ్యక్షులుగా పని చేశారు. ఇతను అగ్రికల్చర్ జనటికల్ సైన్స్​లో అనేక పరిశోధనలు చేసి వరి, గోధుమ, ఆలుగడ్డ, జొన్న మొదలైన పంటల ఉత్పత్తులు పెంచేందుకు కావాల్సిన  వంగడాలను కనిపెట్టారు. ఇతని ఆధ్వర్యంలో 68 మంది శాస్త్రవేత్తలు పీహెచ్​డీ పొంది, దేశానికి సేవ చేసేలా స్ఫూర్తినిచ్చారు. ప్రధానంగా జన్యు పంటలకు జాతీయ బ్యూరో ఏర్పాటు చేసి, జీవవైవిధ్యంపై పరిశోధన చేశారు. నవంబర్ 18, 2004న స్వామినాథన్ అధ్యక్షతన నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ అనే సంస్థను ఏర్పాటయ్యింది. దీనిమీద అనేక పరిశోధనలు చేసి అక్టోబర్ 4, 2006న కేంద్ర ప్రభుత్వ 11వ పంచవర్ష ప్రణాళికకు నివేదికను సమర్పించారు.

- నరహరి వేణుగోపాల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు