
- విలువైన టేకు సంపద కొల్లగొట్టారు..
- పాదయాత్ర చేస్తున్న వాళ్లంతా నాన్ ట్రైబల్ వాళ్లే
- ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే
కాగజ్ నగర్, వెలుగు: ఖర్జేల్లి రేంజ్ చింతలమానేపల్లి మండలం దిందా బండేపల్లి బీట్ లో 1951 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉండగా అందులో 1054 హెక్టార్ల పోడు భూమిగా మారిందని, ఇక్కడ 212 ఎకరాలకు ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చామని కాగజ్ నగర్ ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే పేర్కొన్నారు. దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు కొందరు మూడు రోజుల కింద హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో వారిని ఉద్ధేశించి శనివారం కాగజ్ నగర్ డివిజన్ ఆఫీస్ లో ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ మీడియాతో మాట్లాడారు.
పోడు సాధన పేరిట పాదయాత్ర చేస్తున్న వాళ్ళు అంత నాన్ ట్రైబల్ వాళ్లేనని, అందులోనూ ఎక్కువ మొత్తంలో భూములు ఉన్నవాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. రేంజ్ లోని బండేపల్లి బీట్ లోని కంపార్ట్మెంట్ 178,179 లో 880 హెక్టార్లు,180,181,182 కంపార్ట్మెంట్ ల్లో 734 హెక్టార్లు, చిత్తాం బీట్ లో 192 కంపార్ట్మెంట్ లో337 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమి మొత్తం 1951 హెక్టార్లు ఉందన్నారు. ఇక్కడ ఇప్పటికే అర్హులైన గిరిజన రైతులకు పోడు పట్టాలు ఆర్వో ఎఫ్ ఆర్ కింద ఇవ్వగా సాగు చేస్తున్నట్లు వెల్లడించారు.
వన్యప్రాణుల జీవనానికి, టైగర్ సంచారానికి అడవి నరికివేత, పోడు సాగు అవరోధంగా మారిందని దీని వల్ల పర్యావరణం, బయో డైవర్సిటీ దెబ్బతిందని చెప్పారు. రీ ట్రైవ్ ప్రక్రియపై ఇప్పటికే రైతులకు వివరించామని తెలిపారు. 20 ఎకరాలకు పైగా పోడు భూమి సాగుచేస్తున్న వాళ్లు 16 మంది ఉండగా వాళ్ల అధీనంలో 472 ఎకరాలు, 10 నుంచి 20 ఎకరాలు మధ్య పోడు భూమి ఉన్న రైతులు44 మంది ఉండగా వారి దగ్గర 634 ఎకరాలు ఉందన్నారు.
రీ ట్రైవ్ తో ఇబ్బంది లేకుండా జీవనాధారం కోసం ప్రతీ ఒక రైతుకి 3 ఎకరాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పెద్ద మొత్తంలో అడవిని నరికి పోడు సాగు చేస్తున్న వాళ్లే పాదయత్రకి వెళ్లారని, వాళ్లు అటు అడవిని నరికి విలువైన టేకు సంపద కొల్లగొట్టారని పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు రేంజ్ ఆఫీసర్ సుభాశ్ ఉన్నారు.