భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్రహిల్స్

భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్రహిల్స్

సికింద్రాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ పరిసర ప్రాంతాల ప్రజల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోవిడ్ (కరోనా వైరస్) బాధితుడు మహేంద్రహిల్స్ వాసి కావడంతో అక్కడి ప్రజలతో మాట్లాడడానికి, కలవడానికి చుట్టుపక్కల ప్రజలు జంకుతున్నారు.

అక్కడి పాఠశాలలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు స్కూల్ యాజమాన్యాలు. మహేంద్రహిల్స్ లోని సెయింట్ ఆక్జీలియం పాఠశాల (st auxilium), ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ స్కూల్, బచ్ పన్ స్కూల్ విద్యార్థులకు సెలవు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఇళ్ళకే పరిమితమయ్యారు.

సాధారణ సమయాలలోనే మహేంద్రహిల్స్ నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా భయంతో కర్ఫ్యూ వాతా వరణాన్నే తలదన్నేలా తయారయ్యింది. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా ఇళ్లకు పరిమితమవ్వడమే కాకుండా, విధులు నిర్వర్తించడానికి మాస్కులు ధరించి బయటికి వస్తున్నారు. అలా బయటికి వచ్చిన వారితో ఇతర సిబ్బంది కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

మహేంద్రహిల్స్ లోనే బీసీ బాలుర వసతి గృహం ఉంది. ఆ వసతి గృహంలో ఉంటూ సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట, మారేడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారిని కూడా మూడు రోజులపాటు పాఠశాలలకు రావద్దని పంపించి వేశారు. వీలైనంత తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి   కరోనా భయం గుప్పిటి నుండి తమను బయటకు పడేయాలని అక్కడి జనం కోరుతున్నారు.

మంగళవారం.. మహేంద్రహిల్స్ లో కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం వారు పరిశుభ్రత, అవగాహన చర్యలు చేపట్టగా, బుధవారం జిహెచ్ఎంసి సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో పరిశుభ్రత చర్యలు చేపట్టింది.