దుబ్బాక దెబ్బతో కేసీఆర్ లో ఓటమి బుగులు

దుబ్బాక దెబ్బతో కేసీఆర్ లో ఓటమి బుగులు

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ విషయంలో సీఎం కేసీఆర్ తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆలస్యంగా పెడితే సిటీలో కూడా బీజేపీ పుంజుకుంటుందన్న భయంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అపోజిషన్ పార్టీలు ఎన్నికలకు రెడీ అయ్యే టైమ్ ఇవ్వకుండా సడన్ గా జీహెచ్ఎంసీ షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మిగిలిన పార్టీలు అభ్యర్థులను సెట్ చేసుకునే లోపే టీఆర్ఎస్ ప్రచారంలోకి దూసుకెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు.దుబ్బాకలో గెలిచి మంచి ఊపుమీదవున్న బీజేపీకి ఎక్కువ సమయం ఇస్తే అదే సీన్ గ్రేటర్ లో కూడా రిపీట్ అవుతుందని భావించడమే దీనికి ప్రధాన కారణం.

గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్ పదవీ కాలం ముగియకముందే ఈసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీచేసి 99 గెలిచిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు కూడా 100కు పైగా డివిజన్లు సొంతం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. సిటీ అభివృద్ధికి 400 రకాల పనులు చేయడానికి రూ.67 వేల కోట్లు ఖర్చుచేశామని,  గతంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధి టీఆర్ఎస్ చేసిందని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ అభ్యర్థులకు, నాయకులకు కేసీఆర్ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు, తర్వాత కూడా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆస్తిపన్నులో 50% రాయితీ, పారిశుద్ధ్య కార్మికులకు వేతన పెంపు, ఆర్టీసీ ఉద్యోగులకు కోత విధించిన జీతాల చెల్లింపులు లాంటివి ప్రకటించారు. వరదల తర్వాత సిటీలోని 20 ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించి పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసి తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమా వచ్చాకే ఎలక్షన్లకు దిగారు. రూ.10వేల వరద సాయం కూడా ఎన్నికల్లో భాగమే, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది.

తక్కువ టైమ్ లోనే బీజేపీ గట్టి స్టెప్స్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టైమ్ ఉన్నా బీజేపీ బలపడకూడదన్న ఆలోచనతో టీఆర్ఎస్ దబ్బున ఎన్నికలకు దిగింది. అయినప్పటికీ ఉన్న తక్కువ టైమ్ లోనే టీఆర్ఎస్ ను గట్టిగా సవాలు చేసే స్టెప్స్ తీసుకుంది బీజేపీ. గ్రేటర్ లో ఎలాగైనా మేయర్ పీఠం సొంతం చేసుకోవాలన్న టార్గెట్ తో పని చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చైర్మన్ గా, మరో 23 మంది సీనియర్ నాయకులతో ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించడంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 66 డివిజన్లలో పోటీచేసిన బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొంది, 35 స్థానాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నప్పటికీ.. ఈ సారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా బలంగా వీస్తున్న మోడీ గాలి, టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కొన్ని రోజుల క్రితమే దుబ్బాక ఎన్నికల్లో గెలిచి మంచి ఊపుమీద ఉండటం లాంటి ఎన్నో అనుకూలతలు బీజేపీకి ఉన్నాయి. అవసరమైన చోట్ల ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన అభ్యర్థులను చేర్చుకోవడం ద్వారా తమకు బలం లేని చోట కూడ గట్టి పోటీ ఇచ్చి 80కి పైగా స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో దూకుడుగా పని చేస్తోంది. ఒంటరిగా పోటీ చేయాలనుకున్న జనసేనను తమతో కలుపుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా బీజేపీ జాగ్రత్త పడింది.

తెలంగాణ ఏర్పడినంక కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అయినయ్

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) 2009లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)గా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పూర్తిగా వీక్ అయిపోయింది. తెలంగాణ ఏర్పడినంక 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క డివిజన్​లో మాత్రమే గెలిచింది. దానికి ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లు కూడా 10% దాటలేదు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. అందులో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతను గెలిపిస్తే వారు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారింది.

దుబ్బాక బై ఎలక్షన్స్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీలో చేరతాడని పోలింగ్ రోజున జరిగిన ప్రచారం అభ్యర్థికి చాలా నష్టం చేసింది. వరుస ఎన్నికల్లో ఓటమి, దుబ్బాకలో డిపాజిట్ కూడా రాకపోవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ప్రకటించగానే కీలక నేతలు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీ ఆత్మసైర్యాన్ని దెబ్బతీశాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ పరిస్థితి కూడా అలానే తయారైంది. వాస్తవానికి గ్రౌండ్ లెవల్ లో బలంగా ఉండే ఆ పార్టీ నాయకత్వ లోపం వల్లే దెబ్బతిన్నది. 2016 జరిగిన  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. 65 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశానని ఎప్పుడూ చెప్పుకునే ఆ పార్టీకి గ్రేటర్లో ఓటుబ్యాంకు బాగానే ఉంది. హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు టీడీపీని బాగా ఇష్టపడతారు. కానీ గత ఎన్నికల్లో వీరు ఎక్కువగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈ సారి వీరు ఎటు మొగ్గు చూపుతారనే దాన్ని బట్టి టీడీపీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

బీజేపీ ఊపు కొనసాగిస్తదా?

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టడంలో సక్సెస్ అయిన బీజేపీకి… గ్రేటర్ లో స్ట్రాంగ్ అయ్యే టైమ్ ఇవ్వకూడదనే 15 రోజుల గ్యాప్ లోనే నామినేషన్లు, ఓటింగ్, రిజల్ట్ అన్నీ ముగిసేలా షెడ్యూల్ ఇచ్చి, బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీ షాక్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరి సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. అయితే సిటీలో ఇటీవల వచ్చిన వరదలు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఆరున్నరేండ్లుగా డ్రైనేజీ సిస్టమ్ బాగు చేసే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ చేయకపోవడం లాంటివి ఆ పార్టీని దెబ్బకొడతాయని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ కు మెజారిటీ రాకున్నా ఎంఐఎం సాయం తీసుకుంటుందని, మజ్లిస్ పార్టీ నేతనే మేయర్ గా చేస్తారని.. సిటీ ప్రజలంతా ఒక్కతాటిపై నిలబడి బీజేపీని గెలిపించాలని ప్రచారం చేస్తూ  హిందువుల ఓట్లు గంపగుత్తగా పడేలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్, టీడీపీలు పెద్దగా సీట్లు తెచ్చుకోలేకపోయినా.. ఓట్లు చీల్చి బీజేపీ గెలుపు అవకాశాలను దెబ్బ కొట్టే ప్రమాదం లేకపోలేదు. దుబ్బాక ఊపును బీజేపీ నిలబెట్టుకుని.. జీహెచ్ఎంసీలో గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు స్ట్రాంగ్ అయినట్లే. ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకే కాదు.. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు ఫ్యూచర్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. -కపిలవాయి దిలీప్ కుమార్, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్