మంచిర్యాలకు మళ్లీ ముంపు భయం

మంచిర్యాలకు మళ్లీ ముంపు భయం
  •  కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం 
  •  ఏటా వానాకాలంలో గోదావరికి భారీగా వరదలు 
  •  బ్యారేజీల బ్యాక్ వాటర్​తో ఎగతంతున్న రాళ్లవాగు 
  •  పలు కాలనీలు జల దిగ్భంధం 
  •  రూ.234 కోట్లతో కరకట్టలకు  రెండేండ్ల కిందట ప్రపోజల్స్ 
  •  పట్టించుకోని గత ప్రభుత్వం  
  •  ప్రస్తుత సర్కారు స్పందించాలని ముంపు బాధితుల డిమాండ్ 

మంచిర్యాల, వెలుగు : వానాకాలం రావడంతో మంచిర్యాల ప్రజలకు మళ్లీ ముంపు భయం పట్టుకుంది. ఏటా వానాకాలంలో గోదావరికి భారీగా వరదలు వచ్చి రాళ్లవాగు ఎగతన్నడం వల్ల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు మునుగుతున్నాయి. వేంపల్లి నుంచి ముల్కల్ల వరకు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వరదల నివారణ కోసం గత బీఆర్ఎస్​సర్కారు హయాంలో ఇరిగేషన్​అధికారులు రూ.234 కోట్ల అంచనాలతో రాళ్లవాగుకు 
కరకట్టల నిర్మాణాలకు ప్రతిపాదనలు  రూపొం దించి పంపించారు. 

కానీ, వాటిని అప్పటి సర్కారు పట్టించుకోకుండా బుట్టదాఖలు చేసింది. రెండేండ్లు గడిచినా ఎలాంటి ప్రోగ్రెస్​ లేదు. కాంగ్రెస్ ​ప్రభుత్వమైనా రాళ్లవాగుకు కరకట్టలు కట్టి ముంపును అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మునుగుతున్న కాలనీలు..

గోదావరికి భారీ వరదలు వచ్చి కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​వాటర్ ​కారణంగా జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు పోటు కమ్మింది. ఎన్టీఆర్​నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎన్​క్లేవ్, సంజీవయ్య కాలనీ, రెడ్డికాలనీ, రాళ్లపేట, పాత మంచిర్యాలతో పాటు పలు కాలనీలు మునిగాయి. తోళ్లవాగు పరిసర ప్రాంత కాలనీలు వరదలతో అతలాకుతలమయ్యాయి. వేంపల్లి నుంచి ముల్కల్ల వరకు జలదిగ్బంధమయ్యాయి.

 రాంనగర్​లోని డూప్లెక్స్​లు మునిగిపోవడంతో ఒక్కో ఇంట్లో లక్షల్లో నష్టం జరిగింది. ఫర్నిచర్, ఎలక్ట్రికల్​ సామాన్లతో పాటు నిత్యావసర సరుకులు నీటిపాలయ్యాయి. ఏటా జూలై, ఆగస్టులో గోదావరి పోటెత్తడం వల్ల రాళ్లవాగు వరద ప్రభావంతో వారం, పది రోజుల పాటు ప్రజలు నిరాశ్రయులు కావాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఏనాడూ వరద బాధితులను పట్టించుకున్న పాపానపోలేదు.

 వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినా..సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ముంపు బాధితులకు నిత్యావసరాలు అందించి ఆదుకున్నాయి. వరదలతో ఇండ్లలోకి చేరిన బురదను శుభ్రం చేసుకొని మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం నెల రోజులు పడుతోంది. 2021 నుంచి ఏటా వానాకాలం వస్తోందంటే ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి దాపురించింది.

కరకట్టలు ప్రతిపాదనలకే పరిమితం....  

ముంపు బాధితులను బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రజాప్రతినిధులు రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఇరిగేషన్​అధికారులు 2022లో ఆగస్టు 22, 23 తేదీల్లో సర్వే చేశారు. ఆ యేడు జూలైలో వరదలు వచ్చినప్పుడు రాళ్లవాగులో 139.20 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహించినట్టు గుర్తించారు. రూ.234.86 కోట్ల అంచనాలతో కరకట్టల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. 

ఇందులో కరకట్టల నిర్మాణానికి అవసరమైన 43.28 ఎకరాల భూసేకరణకు రూ.200 కోట్లు, కరకట్టల నిర్మాణానికి రూ.20 కోట్లు, ఇతర పనులకు రూ.14.86 ఖర్చవుతాయని అంచనా వేశారు.  కానీ, గత బీఆర్ఎస్​ సర్కారు ఈ ప్రపోజల్స్​ పట్టించుకోలేదు.  నయాపైసా విడుదల చేయలేదు.  

మంత్రి ఉత్తమ్​ హామీపై ఆశలు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంచిర్యాలలో ముంపు సమస్యను ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఇరిగేషన్​ మినిస్టర్ ​ఉత్తమ్​కుమార్​రెడ్డి కరకట్టలు నిర్మించి ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్​ సర్కారుపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, మళ్లీ వానాకాలం వచ్చినా కరకట్టల నిర్మాణాల్లో కదలిక రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. 

ఈసారి కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అవకాశాలు లేవని వార్తలు వస్తుండడంతో ప్రజలు కాస్త తేరుకుంటున్నారు. నీళ్లు నిల్వ చేస్తే మాత్రం మళ్లీ మంచిర్యాలకు ముంపు ముప్పు తప్పదని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సైతం ముంపు సమస్యను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తెప్పలు, లైఫ్​ జాకెట్లను కొనుగోలు చేసి రెడీగా ఉంచింది.