ఫీజులపై మళ్లీ హియరింగ్..

ఫీజులపై మళ్లీ హియరింగ్..
  • 93 కాలేజీల్లో టీఏఎఫ్‌‌ఆర్సీ రెండోసారి హియరింగ్ 
  •     గతంలో పెంచిన 80 కాలేజీల్లో ఫీజుల కోత 
  •     మినిమమ్ ఫీజును రూ.45 వేలకు పెంచుతూ కమిటీ తీర్మానం 
  •     12 కాలేజీల్లోనే ఫీజులు లక్ష దాటినయ్‌‌ 
  •     తప్పులను సరిదిద్దుకుంటున్న టీఏఎఫ్‌‌ఆర్సీ 
  •     నేడు కమిటీ భేటీలో ఫీజులు ఫైనల్ చేసే చాన్స్‌‌​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఇంజినీరింగ్‌‌ కాలేజీల్లో ఫీజులు తగ్గుతున్నాయి. ఫీజుల పెంపులో జరిగిన ఆడిటింగ్‌‌ తప్పులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలేజీల మేనేజ్‌‌మెంట్లతో రెండోసారి హియరింగ్ నిర్వహించింది. ఈ హియరింగ్‌‌లో దాదాపు అన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గించారు. అయితే, ఆడిటింగ్‌‌లో తప్పులు చేసిన అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోమని టీఏఎఫ్‌‌ఆర్సీ ఉన్నతాధికారులు చెప్తుండటం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో 2019–22 బ్లాక్ పీరియడ్ ముగిసింది. 

2022–25 బ్లాక్ పీరియడ్ కోసం టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ ఈ ఏడాది ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. జులైలో దరఖాస్తు చేసుకున్న 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో హియరింగ్ నిర్వహించి, రూ.45 వేల నుంచి రూ.1.73 లక్షల వరకు ఫీజులు ఖరారు చేసింది. ఇంత భారీగా ఫీజులు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థి సంఘాలు 
ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఈ బ్లాక్ పీరియడ్‌‌‌‌లో ఫస్టియర్ 2022–23లో ఉన్న పాత ఫీజులే వసూలు చేసుకోవాలని, ఆ తర్వాతి రెండేండ్లు టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం అనధికారికంగా సూచించింది. దీనికి సంబంధించి ఇంకా జీవో జారీ చేయలేదు. అయితే, కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లు మాత్రం టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ నిర్ణయించిన ఫీజులే వసూలు చేసుకునేలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని, ఫీజులను పెంచుకున్నాయి. 

ప్రైవేటు కాలేజీలు ఇచ్చిన వివరాలను టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ ఆడిటింగ్ టీమ్‌‌‌‌లు సరిగా చేయకపోవడంతో ఫీజులు భారీగా పెరిగాయి. ఫీజుల పెంపుపై తీవ్ర విమర్శలు రావడంతో టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ మళ్లీ హియరింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికీ 93 కాలేజీల హియరింగ్ పూర్తయింది. ఇందులో ఐదారు కాలేజీలు మినహా దాదాపు అన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. గతంలో 40 కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజులుంటే, ప్రస్తుతం 12 కాలేజీల్లోనే లక్ష దాటినట్టు పేర్కొంటున్నారు. సీబీఐటీలో అత్యధికంగా రూ.1.73 లక్షల ఫీజును నిర్ణయించగా, ప్రస్తుతం దాన్ని రూ.1.12 లక్షలకు తగ్గించినట్లు తెలిసింది. నారాయణమ్మ కాలేజీతో పాటు మంత్రి మల్లారెడ్డికి చెందిన పలు కాలేజీలు, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, వర్ధమాన్, శ్రీనిధి తదితర కాలేజీల్లోనూ ఫీజులు తగ్గించారు. 80 కాలేజీలకు పైగా ఫీజులు తగ్గించినా, ఆడిటింగ్‌‌‌‌లో జరిగిన తప్పులపై మాత్రం టీఏఎఫ్ఆర్సీ లైట్ తీసుకుంటున్నది. ఆడిట్ తప్పులతో ఏకంగా ఓ కాలేజీలో రూ.60 వేల ఫీజు తగ్గడం గమనార్హం. 

నేడు ఫీజుల కమిటీ భేటీ.. 

రెండోసారి కాలేజీలతో హియరింగ్ నిర్వహించిన తర్వాత శనివారం టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ కమిటీ భేటీ కానుంది. ఇందులో ఫీజులను ఫైనల్‌‌‌‌ చేయనున్నారు. మినిమమ్ ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలుకు పెంచుతూ కమిటీ తీర్మానించనుంది. దీంతో పాటు 93 కాలేజీల ఫీజులపై అధికారికంగా కమిటీ వేసి, సర్కారుకు ప్రతిపాదనలు పంపనుంది.

తప్పులు నిజమే కానీ, చర్యలు తీసుకోం.. 

ఆడిటింగ్‌‌‌‌లో తప్పులు జరిగిన మాట నిజమే. దాన్ని గుర్తించి, మళ్లీ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లతో హియరింగ్ నిర్వహించాం. ఇందులో కొన్ని కాలేజీల్లో గతంలో నిర్ణయించిన దాని కంటే ఫీజులు తగ్గించాయి. ఏ కాలేజీలోనూ ఫీజు పెరగలేదు. శనివారం జరిగే టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ సమావేశంలో ఫీజులపై ఫైనల్‌‌‌‌ నిర్ణయం తీసుకుంటాం. తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు పంపుతాం. రెండోసారి హియరింగ్ నిర్వహించడంలో హైకోర్టు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆడిటింగ్ తప్పులపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోం. ఇవన్నీ సాధారణంగా జరిగే తప్పులే. 

- స్వరూప్​రెడ్డి, టీఏఎఫ్​ఆర్సీ చైర్మన్