ఆస్తులు పోతున్నయ్..అప్పులైతున్నయ్

ఆస్తులు పోతున్నయ్..అప్పులైతున్నయ్
  • పేద, మధ్య తరగతి కుటుంబాలు అతలాకుతలం
  • బిల్లులు కట్టేందుకు ఇండ్లు, ప్లాట్లు, పొలాలు అమ్ముకుంటున్న పరిస్థితి
  • ఏండ్లకేండ్లు కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఆవిరి
  • కోట్లు సంపాదిస్తున్నప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్
  • రూ.3 లక్షలు అడ్వాన్స్ కడితే కానీ చేర్చుకొని తీరు 
  • రోజుకు రూ.50 వేల నుంచి లక్షపైనే బిల్లులు


కరోనా మహమ్మారి దెబ్బకు పేద మధ్యతరగతి బతుకులు ఆగమైతున్నయ్. రోగమొస్తే పాణం బాగుజేసుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక ఇల్లు వాకిలి అమ్ముకొని రోడ్డున పడుతున్నరు. అయినోళ్లను కాపాడుకునేందుకు ఏండ్లకేండ్లు కష్టంజేసి కాపాయం జేసినవి, బిడ్డపెండ్లికి దాచిపెట్టినవి, పిల్లల చదువుకు కూడబెట్టినవి దవాఖాన్లకు ధారపోస్తున్నరు. తాతముత్తాతల నుంచి వచ్చిన కొద్దొగొప్పో భూమి అయినకాడికి తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. వేల కుటుంబాలు అప్పుల పాలైతున్నయ్. ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​పై నమ్మకం లేక, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి.. ఫీజుల దోపిడీతో వేల కుటుంబాల బతుకులు బర్ బాద్ అయితున్నయ్. లక్షలు పోసినా అయినోళ్లు దక్కక, ఆస్తులు పోయిన బాధితులు ఎందరో ఉన్నారు. 

రోజుకు రూ.100 కోట్లు

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 19 వేలమంది కరోనా పేషెంట్లు హాస్పిటల్స్ లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. వీరిలో గవర్నమెంట్ హాస్పిటళ్లలో అడ్మిట్ అయిన వారు 5,500 మంది వరకు ఉండగా.. 13,500 మంది కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటళ్లతోపాటు ఇతర మీడియం, చిన్నతరహా ప్రైవేట్ హాస్పిటళ్ల బెడ్స్ అన్ని కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. కనీసం రూ.3 లక్షలు అడ్వాన్స్ చెల్లించనిదే బెడ్ కన్ఫర్మ్ చేయడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరిన ఒక్కో పేషెంట్ నుంచి రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పైన చార్జీలు వసూలు చేస్తుండగా.. మీడియం, చిన్న స్థాయి హాస్పిటల్స్ లో మినిమం చార్జీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో పేషెంట్ వారం నుంచి రెండు వారాల వరకు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో రోజుకు రూ.100 కోట్ల వరకు హాస్పిటల్ బిజినెస్ నడుస్తోందని అంచనా. లక్షల్లో వేస్తున్న హాస్పిటల్ బిల్లులు చెల్లించేందుకు కరోనా బాధిత కుటుంబాలకు ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం తప్పా మరో దారి కనిపించడం లేదు.

ఇళ్లు, ప్లాట్ల కాగితాలు తాకట్టు పెట్టి..

కరోనా కష్టకాలంలో అప్పులు పుట్టడం లేదు. ఇంటి పెద్ద హాస్పిటల్ బెడ్ పై ఉంటే.. అప్పులు ఇచ్చేటోళ్లు కూడా వెనకాడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తమ ఇల్లు, ప్లాట్లు, పొలాల పేపర్లు, బంగారం తాకట్టు పెట్టి రూ.5 నుంచి రూ.10 మిత్తికి లక్షలాది రూపాయలు అప్పులు తెస్తున్నారు. మరికొందరు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే అప్పటికప్పుడు ఆస్తులు బేరానికి పెట్టి.. డబ్బులు తెచ్చుకుంటున్నారు. కుటుంబం మొత్తం హాస్పిటల్ లో అడ్మిట్ అయితే సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బిల్లు అవుతోంది. దీంతో గత పది, పదిహేనేళ్లలో కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఒక్క దెబ్బతో ఖర్చయిపోతోంది.

ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను యాక్సెప్ట్ చేయట్లే

అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్ మెంట్ కోసం మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్న అనేక మందికి క్యాష్‌లెస్ చికిత్స అందటం లేదు. చాలా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను యాక్సెప్ట్ చేయడం లేదు. అడ్వాన్స్ క్యాష్ చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. దీంతో ‘ముందు పైసలు కట్టి, ట్రీట్మెంట్ చేయించుకొని, రీయింబర్స్‌ మెంట్‌కు అప్లై చేసుకోండి’ అని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. పోనీ అలా అప్లై చేసుకున్నా.. పీపీఈ కిట్లు, శానిటైజేషన్‌ చార్జీలు, నెబ్యులైజర్‌ కిట్లు, స్టీమ్‌ ఇన్‌హీలర్లు, థర్మామీటర్ల ఖర్చుకు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. పైగా మొత్తం బిల్లుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు కోత విధిస్తున్నాయి. దీంతో ముందస్తుగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించకున్నా ఇబ్బందులు తప్పడం లేదు.