బెంగళూరులో అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ అరెస్ట్

బెంగళూరులో అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ అరెస్ట్

బెంగుళూరు: అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్‎ను గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఐటీ రాజధాని బెంగుళూరులో బుధవారం (జూలై 30) అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని 30 ఏళ్ల షామా పర్వీన్‌గా గుర్తించారు అధికారులు. తీవ్రవాద భావజాలం కలిగిన పర్వీన్‌ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పని చేస్తున్నట్లు గుర్తించారు. కర్నాటక నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను పర్వీన్ నడిపిస్తున్నట్లు కనుగొన్నారు. 

కాగా.. 2025, జూలై 23న దేశంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు అల్ ఖైదా టెర్రరిస్టులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సదరు నిందితులను విచారించగా పర్వీన్ వ్యవహారం బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం (జూలై 30) పర్వీన్‎ను అరెస్ట్ చేసింది గుజరాత్ ఏటీఎస్. పర్వీన్ అరెస్ట్‎పై గుజరాత్ హోం మినిస్టర్ హర్ష్ సంఘ్వి మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో అరెస్టయిన మహిళ తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆన్‌లైన్ ఉగ్రవాద మాడ్యూల్‌ను నడుపుతోందని పేర్కొన్నారు. ఆమెకు పాకిస్తాన్‎తో కూడా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 

కాగా, 2025, జూలై 23న నలుగురు అల్‌‌‌‌ఖైదా టెర్రరిస్టులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరిని ఢిల్లీ, మరొకరిని నొయిడా, మరో ఇద్దరిని అహ్మదాబాద్‎లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయి వారిని మొహమ్మద్ ఫైక్ (ఢిల్లీ), మొహమ్మద్ ఫర్దీన్ (అహ్మదాబాద్), సెఫుల్లా ఖురేషి (మొడాసా), జీషాన్ అలీ (నోయిడా, యూపీ)గా అధికారులు గుర్తించారు. 

ఈ నలుగురు నకిలీ నోట్ల దందా నడుపుతూ టెర్రర్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లను, ఆటో-డిలీట్ యాప్‌‌‌‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. టెర్రరిస్టులు తమ కమ్యూనికేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తొలగించడానికే ఆటో-డిలీట్ యాప్‌‌‌‌లను ఉపయోగించారని వివరించారు. 

వీరికి చాలాకాలం నుంచి టెర్రర్ సంస్థతో సంబంధముందన్నారు. సోషల్ మీడియా ద్వారా అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. గుజరాత్‌‌‌‌లో టెర్రర్ కార్యకలాపాలపై చర్చలు జరుపుతూ ఏటీఎస్ దృష్టిలో పడ్డారని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ ఇన్‌‌‌‌పుట్‌‌‌‌లు, నిఘా ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.