
స్పోర్ట్స్..
సింగపూర్ గ్రాండ్‌ప్రి
సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్‌గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్‌స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు.
ప్రపంచకప్ షూటింగ్లో గోల్డ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో ఇలవేనిల్ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
నేషనల్
‘సంవిధాన్ సదన్’ గా పాత పార్లమెంట్ బిల్డింగ్
పాత పార్లమెంట్ బిల్డింగ్‌ను సంవిధాన్ సదన్ గా పిలుచుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్‌లో 8 వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్‌లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరు పెట్టారు.
పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా నోటిఫై చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ గొర్రె జాతులకు గుర్తింపు
అరుదైన గొర్రె జాతులకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాలకు ఈ గుర్తింపు దక్కింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం
లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లును రాజ్యసభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. పెద్దల సభలో 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు.
వ్యక్తులు
రజినీకాంత్
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 జరగనున్న నేపథ్యంలో భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో అబితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది. తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ అందించింది.
హలెప్
డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సిమోనా హలెప్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ చెప్పింది. 31 ఏళ్ల హలెప్ 2022 యుఎస్ ఓపెన్ సందర్భంగా డోప్ పరీక్షల్లో విఫలమైంది.
కర్రి సంధ్యారెడ్డి
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారి తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
జూనియర్ ఎన్టీఆర్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణకు కమిటీ
వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అటవీ శాఖ మంత్రితో పాటు మరో 12 మంది సభ్యులు ఉంటారు.
మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (కాచిగూడ–బెంగళూరు) రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇస్రో స్పేస్ టూరిజం
ఇస్రో చంద్రయాన్–3, ఆదిత్య ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ఇంటర్నేషనల్
కెనడా పౌరులకు వీసాలు నిలిపివేత
జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది.
హిజాబ్‌ను కాదంటే పదేళ్ల జైలు
ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది.
ఉక్రెయిన్‌కు పోలండ్ షాక్
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని పొరుగు దేశమైన పోలండ్ తేల్చిచెప్పింది. నల్ల సముద్రంలోకి ఉక్రెయిన్ ధాన్యాన్ని రష్యా పెద్దగా రానివ్వకపోవడం పరోక్షంగా విభేదాలకు కారణమైంది. కొత్తగా సైనిక సాయాన్ని అందించబోమని పోలండ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.