
- ఫర్టిలైజర్ డీలర్ల బ్లాక్ దందా
- పంట పెట్టుబడులకు డబ్బులు తీసుకుంటున్న వారికే సంచులు
- మిగతా రైతులు అవసరం ఉందని వచ్చినా స్టాక్ లేదని పంపిస్తున్న వైనం
- వర్షాలు పడుతుండటంతో పత్తి, మక్క, జొన్న, కంది పంటలకు అత్యవసరం
చిన్నచింతకుంట/అడ్డాకుల, వెలుగు :యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడ స్టాక్ లేక ఇప్పటికే సమస్యలు వస్తుండగా.. మరో వైపు ఫర్టిలైజర్ దుకాణాదారులు యూరియాను బ్లాక్ చేస్తున్నారు. వచ్చిన స్టాక్‌ను అవసరం ఉన్న రైతులకు కాకుండా.. వారి దుకాణాలకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లకు ఇస్తుండటంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారు..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని కొందరు ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాదారులు ప్రభుత్వం వారికి కేటాయించిన యూరియా స్టాక్‌ను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న రైతులకు కాకుండా, అవసరం లేని రైతులకు అమ్ముతున్నారు. ప్రధానంగా వారి ఫర్టిలైజర్ దుకాణాలకు రెగ్యులర్‌గా వచ్చి క్రిమిసంహారక మందులు, విత్తనాలు, పంటల పెట్టుబడుల కోసం అప్పులు తీసుకునే రైతులకు యూరియా ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి షాప్‌కు స్టాక్ రాగానే.. వెంటనే వారు ఆ షాపులకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.
అవసరం ఉన్న రైతులు యూరియా కోసం వస్తే స్టాక్ అయిపోయిందని తిప్పి పంపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు మాత్రం డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సెంటర్లలో ఒక బస్తా యూరియా రూ.267 ఉంటే.. దుకాణాల్లో మాత్రం రూ.300 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కల బక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.వంద అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.
పంటలకు అత్యవసరం
సాగునీటి వసతులు అంతగా లేని మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు వానాకాలం సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేస్తూ వస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో 3.48 లక్షల ఎకరాల్లో పత్తి, మక్క, జొన్న, కంది పంటలు సాగులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పాలమూరు జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో పత్తి, మక్క, జొన్న సాగు కాగా.. నారాయణపేట జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో కంది, పత్తి, జొన్న సాగు ప్రారంభమైంది. అయితే ఈ పంటల సాగుకు మేలో రైతులు విత్తనాలు చల్లుకోగా మొదట్లో వర్షాలు పడటంతో మొలకలు వచ్చాయి.
జూన్ రెండో వారం నుంచి జులై చివరి వారం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. వారం రోజులుగా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రైతులు యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు వెళితే వ్యాపారులు సంచులు ఇవ్వకుండా తిప్పి పంపిస్తున్నారు. మక్క, జొన్న రైతులదీ ఇదే పరిస్థితి ఉంది. బోరు బావుల కింద ఉన్న చేన్ల నీరు అంది పంట ఏపుగా పెరిగింది. కానీ సాగునీటి వసతి లేని చోట వర్షాలు లేక చేను రెండు ఫీట్లకు మించి పెరగలేదు. ప్రస్తుతం ఈ చేన్లు ఎదగాలంటే యూరియా తప్పనిసరి.
60:40 పద్ధతిలో సరఫరా
కేంద్రం నుంచి వస్తున్న యూరియా స్టాక్‌ను రాష్ర్ట ప్రభుత్వం అన్ని మండల, జిల్లా కేంద్రాల్లోని ఆగ్రోస్, ఆకా, ప్రాథమిక సహకార సంఘాలు, మన గ్రోమోర్ సెంటర్లకు అలాట్ చేస్తోంది. ఇవి కాకుండా ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలకు కూడా స్టాక్‌ను అలాట్ చేస్తోంది. అయితే ఈ సీజన్లో కేంద్రం నుంచి సరిపడా స్టాక్ రాకపోవడంతో పంపిణీలో కొంత ఆలస్యమైంది. వచ్చిన స్టాక్‌ను ఆగ్రోస్, గ్రోమోర్, ఆకా, పీఏసీఎస్‌లకు 60 శాతం.. ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలను 40 శాతం బస్తాలను ప్రభుత్వం అలాట్ చేస్తోంది.
'మా షాపులో మందులు కొన్నావా?' అని అడుగుతున్నారు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేసిన. వర్షాలు సరిగ్గా లేక పంట ఎదగలేదు. పొటాష్‌తో కలిసి యూరియా తప్పక వేయాల్సిన పరిస్థితి. యూరియా కోసం సింగిల్ విండో సెంటర్‌కు పోతే అక్కడ పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లా. అక్కడ ‘మందులు ఎక్కడ తీసుకున్నావ్? నా దగ్గర డీఏపీ సంచులు, పిచికారీ మందులను తీసుకున్నావా? లేదు? కాబట్టి నీకు యూరియా ఇవ్వం’ అని వ్యాపారి తెగేసి చెబుతున్నారు. అధికారులు స్పందించి రైతులకు యూరియా అందేలా చేయాలి.
కావలి నాగరాజు, రైతు, అమ్మపూర్ గ్రామం. చిన్నచింతకుంట మండలం యూరియా స్టార్ట్ రాసి పెట్టాలి
నిబంధనల ప్రకారం ప్రతి ఎరువుల షాప్ ముందు వారి దగ్గర ఉన్న యూరియా స్టాక్ వివరాలను షాపు ముందు బోర్డులో రాసి ఉంచాలి. ఎరువుల దుకాణంలో యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు అమ్మకపోతే మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా ఇప్పిస్తున్నారు. యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకపోతే ఆ ఎరువులు అమ్మే దుకాణదారులపై యాక్షన్ తీసుకుంటాం..
- వెంకటేశ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మహబూబ్ నగర్