‘గోల్‌’ సంబురం: అట్టహాసంగా ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ ప్రారంభ వేడుకలు... తొలిసారి మూడు వేదికల్లో..

‘గోల్‌’ సంబురం: అట్టహాసంగా ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ ప్రారంభ వేడుకలు... తొలిసారి మూడు వేదికల్లో..

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అందరూ ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారి మూడు వేదికల్లో మూడు భిన్నమైన సమయాల్లో ఈ వేడుకలకు నిర్వహిస్తున్నారు.

మెక్సికో సిటీ: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అందరూ ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారి మూడు వేదికల్లో మూడు భిన్నమైన సమయాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. టోర్నీ సహా ఆతిథ్య దేశమైన మెక్సికోలో తొలి ప్రారంభ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. వేలాది మంది ఫ్యాన్స్‌‌ తరలి రావడంతో ఎస్టాడియో అజ్టెకా సిటీ స్టేడియం హోరెత్తిపోయింది. 

కొలంబియన్‌‌ సూపర్‌‌ స్టార్‌‌ షకీరా వేదికపై రావడంతో కార్యక్రమం మరింత శోభను సంతరించుకుంది. నైజీరియన్‌‌ సంగీత తారా బర్నా బాయ్‌‌తో కలిసి ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ అధికారిక గీతం ‘డై డై’ని ప్రదర్శించడంతో  ప్రేక్షకులు ఊగిపోయారు. కొలంబియన్‌‌ సంగీత సంచలనం జే బాల్విన్‌‌, అలెజాండ్రో ఫెర్నాండెజ్, బెలిండా, లీలా డౌన్స్, లాస్ ఏంజిల్స్ అజుల్స్, మానా మరియు టైలా తమ ఆటపాటలతో అలరించారు. 

సింగిల్‌‌ రోప్‌‌పై వేలాడిన కళకారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. స్టాండ్స్‌‌లోని ఫ్యాన్స్‌‌ కేరింతల మధ్య టోర్నీలో పాల్గొనే దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించారు. సాంప్రదాయ నృత్యాలు, వివిధ కళా రూపాలతో స్టేడియం మెరిసి మురిసింది. ఆర్‌‌ యు రెడీ మెక్సికో సిటీ, టు నైట్‌‌ వీ ఆర్‌‌ వన్‌‌, క్రాసింగ్‌‌ బోర్డర్స్‌‌ విత్‌‌ ద సన్‌‌, వి స్టాండ్‌‌ యునైటెడ్‌‌, సెలబ్రెటెడ్‌‌ వన్‌‌, వన్‌‌ ప్లానెట్‌‌ వన్‌‌ మ్యూజిక్‌‌ అంటూ వ్యాఖ్యానాలతో స్టేడియం హోరెత్తింది. డ్రమ్స్‌‌ వాయిద్యాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణా సంచా వెలుగులు, లేజర్‌‌ కాంతులతో వివిధ రూపాల కళాఖండాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. 

బ్యాండ్‌‌ మోతల మధ్య శాంతి కపోతం పావురాన్ని ఓ పెద్ద ట్రాలీపై స్టేడియంపైకి తీసుకొచ్చారు. టోర్నీలో పాల్గొంటున్న జట్లతో గ్లోబ్‌‌ను సృష్టించారు. ఆ తర్వాత బంగారు వర్ణంతో కూడిన ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ను చూపెట్టడంతో అటు అభిమానులు, ఇటు ప్లేయర్లు ఊగిపోయారు. తొలి మ్యాచ్‌‌లో తలపడనున్న సౌతాఫ్రికా, మెక్సికో ప్లేయర్లు సందడిగా స్టేడియంలోకి వచ్చారు. లవ్‌‌ సింబల్‌‌ ఆకృతిలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. 

ట్రియోండా..

మూడు దేశాలు కలిపి వరల్డ్‌‌ కప్‌‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం ఈ టోర్నీ ప్రత్యేకతను మరింత పెంచింది. టోర్నీ అధికారిక మ్యాచ్‌‌ బాల్‌‌ అయిన ‘ట్రియోండా’ స్టేడియంలో బాగా సందడి చేసింది. లేజర్‌‌ కాంతులతో ఈ బాల్‌‌ను క్రియేట్‌‌ చేశారు. ‘మూడు అలలు’ అని అర్థం వచ్చే పేరు కలిగిన ఈ బాల్‌‌పై మూడు ఆతిథ్య దేశాల రంగులు, చిహ్నాలు ఉన్నాయి. మెక్సికోతో పాటు కెనడా, అమెరికా ఆతిథ్య దేశాలు కావడంతో ఇక్కడ కూడా ఓపెనింగ్‌‌ సెర్మనీ నిర్వహించనున్నారు. 

అలనిస్ మోరిసెట్, అలెస్సియా కారా, మైఖేల్ బుబ్లే, ఎలియన్నా, జెస్సీ రేయెజ్, నోరా ఫతేహి, సంజోయ్, వెజ్‌‌డ్రీమ్ మరియు విలియం ప్రిన్స్ టొరంటోలో ఆడి పాడనున్నారు. లాస్‌‌ ఏంజిల్స్‌‌లో కేటీ పెర్రీ, ఫ్యూచర్, అనిట్టా, లిసా, రెమా మరియు టైలా ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగించనున్నారు. ఈ వరల్డ్‌‌ కప్‌‌లో 48 జట్లు పాల్గొంటుండగా.. అమెరికా, మెక్సికో, కెనడాలో 16 నగరాలు 104 మ్యాచ్‌‌లకు ఆతిథ్యమిస్తున్నాయి.