చిరుతల భీకర పోరు.. ఒక దానికి గాయాలు

చిరుతల భీకర పోరు.. ఒక దానికి గాయాలు

ప్రాజెక్ట్​ చీతాలో భాగంగా తీసుకువచ్చిన చిరుతల మధ్య  భీకర పోరు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కొట్లాటలో ఒక చిరుత తీవ్రంగా గాయపడిందని అన్నారు.  ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత పులులను మధ్యప్రదేశ్​లోని షియోపూర్​లోని కూనో జాతీయ పార్క్​లో ఇటీవలే విడిచి పెట్టారు. పలు కారణాలతో వీటిల్లో కొన్ని మరణించాయి. తాజాగా కొన్ని పోట్లాడుకున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన గౌరవ్​, శౌర్య, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన అగ్ని, వాయు చీతాలు పోట్లాడి.. పరస్పరం గాయపరుచుకున్నాయి. పార్కులోని ఫ్రీ రేంజ్ ఏరియాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. వాటి ఘర్షణను గమనించిన అధికారులు ఆపేందుకు క్రాకర్స్​ కాల్చారు. సైరన్లు పెట్టారు. ఇది కొంత ఫలించింది.

తీవ్రంగా గాయపడిన చీతా..

ఈ పోరులో అగ్ని అనే చిరుత తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దానికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఇలాంటి ఘర్షణలు క్రూర మృగాల మధ్య సహజమేనని ఫారెస్ట్ డివిజనల్​ ఆఫీసర్​ పీకే వర్మ చెప్పారు. అంతరించిపోతున్న చిరుత పులులను రక్షించే కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్​ చీతా అనే ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో భాగంగా 2022లో 8 చిరుతపులులను కూనో నేషనల్​ పార్కుకి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చిరుతలను పార్కుకి తరలించారు. వివిధ కారణాల వల్ల వీటిల్లో మొత్తం ఆరు చనిపోయాయి. మిగతా వాటిని రక్షించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.