గ్రామంలో ఇళ్లపై కూలిన యుద్ధ విమానం

గ్రామంలో ఇళ్లపై కూలిన యుద్ధ విమానం

భారత్ వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం  రాజస్థాన్ లో కూలిపోయింది. విమాన భద్రత సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీ సోమవారం ఉదయం భారత్ కు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం.. సూరత్ గఢ్ నుంచి బయలుదేరింది. విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో హనుమాన్ గఢ్  జిల్లా డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై విమానం కుప్ప కూలింది.

విమానం క్రాష్ ల్యాండింగ్ అవుతున్నట్లు గుర్తించిన పైలెట్.. ప్యారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. విమానంలో పైలెట్ ఒక్కరే ఉన్నారు. విమానం ఓ ఇంటిపై కూలిపోవటంతో.. ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైలెట్ సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్ రుక్మణి రియార్ తెలిపారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తోంది రక్షణ శాఖ. 

ఇదే ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న ఫైటర్ జెట్ రాజస్థాన్ లోని భరత్ పుర్ లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ మృతి చెందారు.