సినిమాల్లో పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపీ.. ఇద్దరి అరెస్ట్

సినిమాల్లో పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపీ.. ఇద్దరి అరెస్ట్

సినిమాల నిర్మాణానికి పెట్టుబడులు పెడితే.. భారీ ప్రతిఫలం ఇప్పిస్తామని 25 మంది దగ్గర రూ. 6 కోట్ల దాకా  వసూలుచేసి మోసగించిన వ్యక్తుల బండారం బయటపడింది. ఈ వ్యవహారంలో ఉమా శంకర్, కొంగర అంజమ్మ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు హైదరాబాద్ సీసీఎస్ డీడీ జాయింట్ సీపీ వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ, ఉమా శంకర్ లు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బోర్ వెల్స్ రంగాల్లో పెట్టుబడుల పేరుతో జనాల వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారన్నారు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. 

మరో కేసులో...

సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని యువతులను మోసం చేసిన కేసును చేధించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ముందుగానే గిఫ్ట్ పంపిస్తారని.. ఆ తర్వాత తాము ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్ అధికారులమని ఫోన్ లో బుకాయించే వారని తెలిపారు. తాము పంపిన గిఫ్ట్ ల పార్సిల్ ట్యాక్స్ కట్టాలంటూ యువతులను బెదిరించి దాదాపు రూ. 2.2 లక్షలు వసూలు చేశారన్నారు. ఇలా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన నైజీరియా, ఘనా కు చెందిన ఆలోటే పీటర్, రొమాన్స్ జాషువులను పోలీసులు గుర్తించారు. వీసాపై ఢిల్లీకి వచ్చిన వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇండియాలో ఉన్న యువతులకు రిక్వెస్ట్ పెట్టి చాట్ చేస్తుంటారన్నారు. నగలు, ఫోన్స్, ల్యాప్ టాప్ ల ఫొటోలను పంపి మోసం చేశారన్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో కొత్త వ్యక్తుల పట్ల ప్రజలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.