యూపీ దళిత మహిళల మీద సినిమా

యూపీ దళిత మహిళల మీద సినిమా

బ్యూటిఫుల్ లొకేషన్స్​, గ్రాఫిక్స్​తో చేసే మాయ, కుందనపు బొమ్మల్లా కనిపించే అమ్మాయిలు, మాస్​ డాన్స్​లు, క్లాసికల్ పాటలు ఉండే సినిమా కాదు. ఇదొక నేచురల్ ఫిల్మ్. ఉత్తరప్రదేశ్​లో దళితులు నివసించే ఇళ్లు. వాళ్ల జీవనవిధానం, కట్టు, బొట్టు... వాటన్నింటికీ మించి ఆ ఆడవాళ్లలో ఉన్న ధైర్యం. తెగువ, పట్టుదలతో వాళ్లు సాధించే విజయాలను కళ్లకు కట్టినట్టు చూపెడుతుంది. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆస్కార్​ అవార్డ్​కు ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్​’ కేటగిరీలో నామినేట్ అయింది. మరి ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన ఎవరికొచ్చింది? ఎవరు తీశారు? అంటే... రింటూ థామస్, సుశ్మిత్​ ఘోష్​ అనే భార్యాభర్తలు తీశారు. వాళ్లిద్దరి

సక్సెస్ జర్నీ...
రింటూ థామస్, సుశ్మిత్​ ఘోష్​ దంపతులు కలిసి ఓ చక్కటి డాక్యుమెంటరీ తీశారు. అదే ‘రైటింగ్ విత్​ ఫైర్’. ఉత్తరప్రదేశ్​లోని దళిత మహిళల మీద తీసిన సినిమా ఇది. ఈ మహిళలు సామాన్యులు కారు. అసామాన్యులు. వాళ్లంతా కలిసి ‘ఖబర్ లహరియా’ అనే న్యూస్​ పేపర్​ నడిపిస్తున్నారు. కేవలం మహిళలే నడిపిస్తున్న ఈ పేపర్​ దేశంలోనే మొదటిది. డాక్యుమెంటరీ అంతా ఆ న్యూస్ పేపర్​ చుట్టూ తిరుగుతుంటుంది. దీనికి పెద్ద కాస్టింగ్, టెక్నీషియన్స్​ లేరు. రైటింగ్, డైరెక్షన్​, ప్రొడక్షన్, ఎడిటింగ్ అన్నీ వీళ్లిద్దరే చేశారు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా, అది నిజమే. చివరికి సినిమాటోగ్రఫీలో కూడా వాళ్లలో ఒకరు పాలుపంచుకున్నారు. సుశ్మిత్ ఘోష్​, కరణ్​ థప్లియాల్​లు కలిసి తీశారు. ఈ సినిమా ద్వారా, ఇప్పటి జర్నలిస్ట్​ల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనేది క్లియర్​గా అర్థమవుతుంది అంటారు కపుల్ ఫిల్మ్​ మేకర్స్​.
బ్యాక్​ గ్రౌండ్
రింటూ వాళ్ల అమ్మానాన్న రాజు థామస్, షిజి. కేరళలోని కొట్టాయంలో ఉంటారు. రింటూ ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్​లో ఇంగ్లీష్ లిటరేచర్​లో బి.ఏ ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మాస్​ కమ్యూనికేషన్స్​లో మాస్టర్స్​ చేసింది. జర్నలిజం కెరీర్​లో ముందుకెళ్లాలనేది ఆమె కల. మాస్టర్స్​ చేసేటప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకుంది. 
సుశ్మిత్ బెంగాలీ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు సెంట్రల్​ ఆఫ్రికాలో చదువుకున్నాడు. బీకాం తర్వాత ఎం.బి.ఏ చేయాలనుకున్నాడు. కానీ, ఒక సంవత్సరం కార్పొరేట్ జాబ్ చేశాడు. ఆ జాబ్​ తనకు సరికాదనిపించి, ఇండియా వచ్చేశాడు. ఆ టైంలోనే డిఫరెంట్​లీ ఏబుల్డ్​ స్ట్రీట్ చిల్డ్రన్​తో కలిసి హిమాలయాలకు ట్రిప్​కు వెళ్లాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ తనకి కెమెరా ఇచ్చి, ఈ ట్రిప్​ మొత్తం ఫిల్మ్​లా చేసి ఇవ్వమన్నాడట. తర్వాత తిరిగొచ్చాక ఆ వీడియో చూస్తే ఇంట్రెస్టింగ్​గా అనిపించింది ఘోష్​కి. దాంతో ఫిల్మ్​ మేకింగ్ గురించి ఏం తెలియకుండానే ‘బుల్లెట్స్​ అండ్ బటర్ ఫ్లైస్​’ అనే ఫిల్మ్ తీశాడు. అది నేషనల్, ఇంటర్నేషనల్​గా పాపులర్ అయింది. అలా పూర్తిగా తన ఆలోచన ఫిల్మ్​ మేకింగ్ మీదకు మారిందంటాడు సుశ్మిత్. 
ఇద్దరూ కలిసి...
రింటూ థామస్, సుశ్మిత్​ ఘోష్​ న్యూఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అప్పుడే వాళ్లిద్దరూ కలిసి డాక్యుమెంటరీలు తీయాలనుకున్నారు. అలా ప్రొడక్షన్​ హౌస్​ మొదలుపెట్టి కెరీర్ స్టార్ట్ చేశారు. వాళ్లిద్దరూ కలిసి తీసిన ‘మిరకిల్ వాటర్ విలేజ్’ అనే డాక్యుమెంటరీ నేషనల్ జాగ్రఫీ ఛానెల్​లో బాగా పాపులర్ అయింది. తర్వాత 27 నిమిషాల ‘దిల్లీ’, 18 నిమిషాల ‘తింబుక్తు’ డాక్యుమెంటరీలు తీశారు. 2012లో నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అంతేకాదు, ఇద్దరూ కలిసి సన్​ డాన్స్ ఇనిస్టిట్యూట్, చికెన్ అండ్ ఎగ్ పిక్చర్స్, ఐడిఎఫ్​.ఏ, ఎస్​.ఎఫ్. ఎఫ్​ ఫిల్మ్ ఫండ్, డాక్యుమెంటరీ సొసైటీ, బెర్తా ఫౌండేషన్స్​ వంటివాటిలో పనిచేశారు. పదేండ్లుగా వీళ్లు తీసిన సినిమాలు సొసైటీలో మార్పు కోసం అడ్వొకసీ టూల్స్​గా, ఇంటర్నేషనల్​ స్కూల్స్​లో లెసన్స్​గా ఉన్నాయి.  యునైటెడ్ నేషన్స్​ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్​లో, ది లింకన్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి ప్రదేశాలలో కూడా దీనిని ప్రదర్శించారు. ఇప్పుడు ఆస్కార్​కు నామినేట్ అయిన డాక్యుమెంటరీ ఫిల్మ్​ కూడా 90 ఫెస్టివల్స్​లో ప్రదర్శించారు. 22 ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి.   
రెండు ఆలోచనలు... నిర్ణయం ఒకటే
వాళ్లు కథ చెప్పే విధానం, ఫిలాసఫీ అన్నీ ఒకేలా ఉండేవి. ఆలోచనలు పంచుకోవడం, ఒకే నిర్ణయానికి రావడం లాంటివి బాగా కుదిరేవి. నిజానికి పెళ్లయ్యాక పనిని ఇంటి వరకు తీసుకురాకూడదు. అక్కడి పని అక్కడే, ఇంట్లో హ్యాపీగా ఉండాలి అనుకునేవారట. కానీ అనుకున్నవన్నీ జరగలేదు. ప్యాండెమిక్​లో ఇద్దరూ కలిసి ఫిల్మ్​ ఎడిటింగ్ చేశారు. ఆ తర్వాత ఆ పని పక్కన పెడితే ఇంటిపని, వంట ఇవన్నీ కూడా కలిసి చేసుకునేవారని, అప్పుడు అస్సలు టైం సరిపోయేది కాదని సుశ్మిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు​. సుశ్మిత్ గురించి రింటూ మాట్లాడుతూ.. ‘సుశ్మిత్​కి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. నాకు సినిమాలో  కొన్ని విషయాలు మాత్రమే బాగా నచ్చుతాయి. మా కాంబినేషన్ మ్యాక్రో, మైక్రోలా ఉంటుంది. వేరు వేరుగా ఆలోచించినా ఇద్దరి నిర్ణయాలు కలిపే పని చేస్తాం’ అని చెప్పింది. 
బ్లాక్ టికెట్ 
సాధారణంగా భార్యాభర్తల ఆలోచనలు నూటికి ఎనభై శాతం కలవవు. ఇద్దరూ కలిసి ఒకే పనిచేయడం కూడా అరుదే. చాలాసార్లు ఒకరి మాట మీదే ఇద్దరూ వెళ్లిపోతుంటారు. కానీ, ఇద్దరిదీ ఒకే మాట అయితే... సక్సెస్​ ఈ రేంజ్​లోనే ఉంటుంది అనడానికి సాక్ష్యం వీళ్లే. ఇద్దరూ కలిసి సినిమాలు తీయడం వరకు బాగానే ఉంది. కానీ, అప్పుడే వీళ్లకు వచ్చిన ఆలోచన ప్రొడక్షన్. వీళ్ల ప్రొడక్షన్​ హౌస్​ పేరు ‘బ్లాక్ టికెట్ ఫిల్మ్స్’. దీన్ని 2009లో భార్యాభర్తలిద్దరు కలిసి ఏర్పాటు చేశారు. (కాని అప్పటికి వాళ్లు ఫ్రెండ్స్​ మాత్రమే!) పవర్​ఫుల్ కంటెంట్​తో మెసేజ్ ఇచ్చేందుకు, ఎంటర్​టైన్​ చేసేందుకు, సొసైటీలో మార్పును తెచ్చేందుకు మంచి సినిమాలు తీయడానికి ఈ ప్లాట్​ఫాం బాగా ఉపయోగపడుతుంది.

ఈ ప్రొడక్షన్​, ఎక్కువగా నాన్ – ఫిక్షన్​ కంటెంట్, హ్యూమన్ రైట్స్, జెండర్, సెక్సువాలిటీ, మెటర్నల్, నియోనాటల్ హెల్త్​, క్లైమేట్​ఛేంజ్​ వంటి థీమ్స్​కే ప్రయారిటీ ఇచ్చేదిగా పాపులర్ అయింది. వాటిలో గ్లోబల్ ప్రాబ్లమ్స్​కు కమ్యూనిటీ బేస్డ్, లోకల్ సొల్యూషన్స్​ గురించి మాట్లాడుతుంది. సొసైటీలో, కల్చర్​లో ముఖ్యంగా ప్రజలు, మహిళలు తరచూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్​ని హైలైట్ చేస్తూ సినిమాలు తీస్తారు. వాళ్ల కథల సెలక్షన్​ అలాగే ఉంటుందని కూడా వాళ్లు చెప్తుంటారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్​, యు.ఎన్ కన్వెన్షన్స్​ అండ్​ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్​తో కలిసి ఇప్పటికే చాలా గ్లోబల్ ప్లాట్ ఫామ్​లలో వాళ్ల సినిమాలను ప్రదర్శించారు.