
- కాళేశ్వరం, భద్రాచలంలో పుష్కరఘాట్లను తాకిన గోదావరి
బెల్లంపల్లిరూరల్/కోటపల్లి, వెలుగు : మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రాణహిత నది ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చే వరదతో పాటు కుమ్రంభీం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహం కారణంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలుగామ, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
వేమనపల్లి పుష్కరఘాట్ రోడ్డు పూర్తిగా మునిగిపోగా, ఎంచపాయ, చింతొర్రెతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుంపుటం, కల్లంపల్లి, జాజులపేట, ముక్కిడిగూడం, రాచర్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ఏర్పాటు చేశామని, అత్యవసరమైతే ప్రజలు 08736 250501 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
పోటెత్తుతున్న గోదావరి
మహదేవపూర్/భద్రాచలం/ములుగు: ప్రాణహిత నదితో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పోటెత్తుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం 11.960 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు మరో 0.250 మీటర్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మేడిగడ్డ వద్ద శుక్రవారం సాయంత్రానికి 8,68,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
గోదావరి ఉధృతంగా పారుతుండడంతో తెలంగాణ – చత్తీస్‌గఢ్ హైవేపై టేకులగూడెం వద్ద గల లోలెవెల్ బ్రిడ్జిపైకి నీరు చేరుకుంది. దీంతో ఆ రహదారిపై రాకపోకలు నిలివేశారు. మరో వైపు భద్రాచలంలో గోదావరి నది స్నానఘట్టాలను తాకుతూ 37.60 అడుగుల ఎత్తుతో వెళ్తోంది. వరద ఉధృతిని ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ పరిశీలించారు.