
న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుండటంపై ఆందోళన అవసరం లేదని, రూపాయి కుప్పకూలే పరిస్థితులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి రూపాయి తన సహజమైన దారిలోనే వెళుతోందన్నారు. రూపాయి కదలికలపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, భారీగా హెచ్చుతగ్గులు ఉంటేనే అది కల్పించు కుంటుందని పేర్కొన్నారు. రూపాయి విలువ పెంచడానికో లేదా తగ్గించడానికో ఆర్బీఐ ప్రయత్నించడంలేదని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో భారీగా హెచ్చుతగ్గులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టంచేశారు. మంగళవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్‌లో రూపాయి విలువ తగ్గడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఐలు విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి అనుమతించాలన్న సభ్యుల సూచనలపై స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనను ఆర్బీఐకి పంపుతామని చెప్పారు.
రూపాయి తట్టుకుని నిలబడింది
డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువతో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నా.. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది తక్కువేనని చెప్పారు. యూఎస్ ఫెడ్ నిర్ణయాలను రూపాయి తట్టుకుని నిలబడిందని, రూపాయి కుప్పకూలదని తాను హామీ ఇస్తున్నానని, ఈ విషయాన్ని సభ్యులు గుర్తించాలని కోరారు. విదేశీ మారకం నిల్వలపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ప్రస్తుతం మన దగ్గర 500 బిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. రూపాయి పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2004 నుంచి 2014 మధ్య యూపీఏ హయాంలో రూపాయి విలువ ఏటా 10% నుంచి 12% తగ్గిందని, ఎన్డీయే హయాంలో ఎనిమిదేండ్లలో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 4.54 శాతమే తగ్గిందని చెప్పారు.