Crypto News: విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలకు భారత్ షాక్.. రిజిస్టర్ కాని యాప్స్ బ్లాక్..

Crypto News: విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలకు భారత్ షాక్.. రిజిస్టర్ కాని యాప్స్  బ్లాక్..

ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు లేదా ట్రేడింగ్ చేస్తున్న వారిలో భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తర్వాత అత్యధికంగా క్రిప్టోల స్వీకరణలో భారత్ రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ కూడా పూర్తిగా మారటంతో క్రిప్టోలను చాలా మంది తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో ప్లాన్ చేస్తున్నారు. 

తాజాగా భారతీయ క్రిప్టో ఇన్వెస్టర్లకు ముఖ్యమైన వార్త ఇది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 25 విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలకు నియంత్రణ నోటీసులు జారీ చేసింది . ఈ ప్లాట్‌ఫారమ్‌లు యునైటెడ్ స్టేట్స్, హాంకాంగ్, కంబోడియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల నుండి పనిచేస్తున్న క్రిప్టో సంస్థలు తమ యాప్స్, వెబ్‌సైట్‌లు నిలిపివేయాలని కోరింది. భారత ఐటి చట్ట ప్రకారం నమోదు కానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పబడింది. 

ప్రస్తుతం దేశంలో కేవలం 50 డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే రిజిస్టర్ చేయబడ్డాయి. ఈ క్రమంలో Bitmex, BingX, LBank, YouHodler, Fimex, Zoomex, CoinW, LCX సంస్థలకు ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి. వీటికి తోడు మరిన్ని విదేశీ సంస్థలకు నోటీసులు అందగా.. ఆ ప్లాట్‌ఫామ్‌ల URL లను బ్లాక్ చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

ఇప్పుడు ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి..

ఇకపై ప్రజలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) కింద నమోదైన భారత క్రిప్టో ఎక్స్ఛేంజీలను ఎంచుకోవటం మంచిది. ఈ సంస్థలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కఠిన విధానాల ప్రకారం కస్టమర్ ధృవీకరణ, వివరాల నివేదిక వంటి చర్యలను పాటిస్తున్నాయి. ఇవి కేవలం పరిపాలనా కట్టుబాట్లు మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ నిబద్ధతను కాపాడే ముఖ్య సాధనాలు. ఇది అకౌంటబిలిటీని పెంచటంతో పాటు.. విదేశీ సంస్థల ద్వారా జరుగుతున్న కొన్ని మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో దోహదపడుతుంది. 

దేశీయ క్రిప్టో ట్రేడింగ్ ఫ్లాట్ ఫారంలు ఇక్కడి అధికారులతో అవసరమైన డేటా పంచుకోవడం, ప్రమాణాలను పాటించటం ద్వారా ఇన్వెస్టర్లలో విశ్వాసం, విస్వసనీయతకు పునాదులు వేస్తున్నాయని జియోటస్ క్రిప్టో ఎక్స్చేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. అందువల్ల సరైన సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. భారత కస్టమర్లకు సేవలు అందించే ప్రతి సంస్థ ఒకే నియమాల కింద పనిచేయాలని అన్నారు. ఇలా చేస్తే మొత్తం ఆర్థిక ఎకోసిస్టమ్ మరింత బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందన్నారు. పెట్టుబడిదారులకు ఇది భద్రమైన, నమ్మదగిన వాతావరణాన్ని సృష్టిస్తున్నందున జియోటస్ లాంటి భారతీయ ఎక్స్ఛేంజీలకు మంచి అవకాశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు సుబ్బురాజ్. ఇకపై భారతీయ కస్టమర్లు దీర్ఘకాలిక నమ్మకం, స్పష్టతతో సేవలను పొందొచ్చని అన్నారు.