ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుబడి కష్టాలు .. డబ్బుల్లేక కట్టుకునేందుకు ముందుకురాని లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుబడి కష్టాలు .. డబ్బుల్లేక కట్టుకునేందుకు ముందుకురాని లబ్ధిదారులు
  • జిల్లాలో ఇంకా ప్రారంభానికి నోచుకోని 750 ఇండ్లు
  • ఆర్థిక సమస్యలతో 250 మంది లబ్ధిదారులు వెనుకడుగు 

ఆదిలాబాద్, వెలుగు-: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ చాలామంది ఇంకా పనులు ప్రారంభించలేదు. మొదటి విడత ఇండ్లు మంజూరు చేసి ఐదు నెలలు గడుస్తోంది. ఇప్పటికే కొంత మంది పిల్లర్ల దశ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. కొందరు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇండ్లు నిర్మాణానికి ముందు లబ్ధిదారులు ఖర్చు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి వారి అకౌంట్లలో ఆ నగదు జమ చేస్తుంది. అయితే ముందుగా బేస్​మెంట్, పిల్లర్ల నిర్మాణం చేపట్టేందుకు మెటీరియల్, మేస్త్రీ, కూలీల కోసం దాదాపు రూ. 60 వేలకు వరకు ఖర్చవుతోంది. 

అయితే ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇలా దాదాపు 250 మంది ఇండ్ల నిర్మాణం చేపట్టడం లేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కావడంతో కొంత మంది ప్రస్తుతం తామున్న ఇంటిని తొలగించి అదే స్థానంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలంటే నెలల సమయంలో పడుతుంది. అప్పటివరకు గ్రామాల్లో అద్దెకు కూడా ఇండ్లు దొరకవు కాబట్టి వర్షానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది వెనుకడుగు వేస్తున్నారు. 

ప్రారంభానికి నోచుకోని 750 ఇండ్లు

ఆదిలాబాద్​జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 2,132 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 1,382 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే 750 ఇండ్ల నిర్మాణాలు మాత్రం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇండ్లు కట్టుకునేందుకు వీరు ఆసక్తి చూపడం లేదు. పంచాయతీ కార్యదర్శులు పలుమార్లు సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో వీరి జాబితాను ఎంపీడీవో లాగిన్​లోకి తిరిగి పంపించేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు వీరు ఎప్పుడైనా ఆసక్తి చూపితే అప్పుడు కలెక్టర్ లాగిన్ కు పంపించి అప్రూవ్​చేస్తామని పేర్కొంటున్నారు. వీరి స్థానంలో ఇతర అర్హులకు ఇండ్లు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పించాలి

ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు. మొదట బేస్​మెంట్ వరకు ఇన్వెస్ట్​చేస్తే ఆ తర్వాత అకౌంట్​లో రూ.లక్ష ప్రభుత్వం జమ చేస్తుందని, ఆ తర్వాత దశల వారీగా స్లాబ్ లెవల్​వరకు వెంటవెంటనే నగదు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే మొదట పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట ఖర్చుల కోసం లబ్ధిదారులకు మహిళ సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.