వరుస విజయాలతో జోరు మీద కేకేఆర్‌‌.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై విక్టరీ

వరుస విజయాలతో జోరు మీద కేకేఆర్‌‌.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై విక్టరీ
  • అలెన్‌‌‌‌‌‌‌‌.. దంచెన్‌‌‌‌‌‌‌‌.. సెంచరీతో చెలరేగిన ఫిన్‌‌‌‌‌‌‌‌
  • 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై కోల్‌‌‌‌‌‌‌‌కతా విజయం
  • రాణించిన గ్రీన్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–19 రెండో స్టేజ్‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌ దుమ్మురేపుతోంది. చిన్న ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఫిన్‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 10 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 100 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపు సెంచరీ సాధించడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దాంతో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 142/8 స్కోరు చేసింది.

పాథుమ్‌‌‌‌‌‌‌‌ నిశాంక (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 50), అశుతోష్‌‌‌‌‌‌‌‌ శర్మ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 39) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత కోల్‌‌‌‌‌‌‌‌కతా 14.2 ఓవర్లలో 147/2 స్కోరు చేసి నెగ్గింది. కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 33 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించాడు. ఫిన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.

బ్యాటర్లు ఫెయిల్‌‌‌‌‌‌‌‌..
ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పాథుమ్‌‌‌‌‌‌‌‌ నిశాంక, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. తొలి రెండు ఓవర్లలో 4, 6తో బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించిన నిశాంక తర్వాత మరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో రెచ్చిపోయాడు. మధ్యలో రాహుల్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లతో కుదురుకున్నట్లు కనిపించాడు. 

కానీ ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు ఫోర్లు కొట్టి కార్తీక్‌‌‌‌‌‌‌‌ త్యాగీ (2/25)కి వికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నాడు. ఫలితంగా తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 55/1 స్కోరు చేసిన ఢిల్లీని కోల్‌‌‌‌‌‌‌‌కతా బౌలర్లు మరింత దెబ్బకొట్టారు. 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నిశాంక సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరు కొనసాగించినా.. ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన నితీశ్‌‌‌‌‌‌‌‌ రాణా (8)ను గ్రీన్‌‌‌‌‌‌‌‌ (1/12) బోల్తా కొట్టించాడు. పదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ (1/17) దెబ్బకు సమీర్‌‌‌‌‌‌‌‌ రిజ్వీ (3) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌లో 80/3తో నిలిచిన ఢిల్లీకి 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. 

నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో నిశాంక, ట్రిస్టాన్‌‌‌‌‌‌‌‌ స్టబ్స్‌‌‌‌‌‌‌‌ (2)ను అనుకూల్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ (2/31) ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. నిశాంక 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 89/5తో కష్టాల్లో పడిన ఢిల్లీని గట్టెక్కించే బాధ్యత తీసుకున్న అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (11), అశుతోష్‌‌‌‌‌‌‌‌ శర్మ గట్టిగా పోరాడారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వికెట్లను కాపాడుకున్నారు. దాంతో స్కోరు 15 ఓవర్లలో 98/5కి చేరింది. 

17వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అశుతోష్‌‌‌‌‌‌‌‌ వరుసగా 6, 4, 4తో 16 రన్స్‌‌‌‌‌‌‌‌ దంచాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదినా.. 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. దాంతో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఇదే ఓవర్‌‌‌‌‌‌‌‌లో అశుతోష్‌‌‌‌‌‌‌‌ 6, 4 కొట్టి ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరిగాడు. మరో బాల్‌‌‌‌‌‌‌‌ తర్వాత మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌ (0) రనౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయలేకపోయింది.

అలెన్‌‌‌‌‌‌‌‌ ధనాధన్​..
చిన్న ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌కతాకు ఆరంభంలో ఇబ్బంది ఎదురైనా.. ఫిన్‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌ ఒంటరి పోరాటంతో గట్టెక్కించాడు. ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌, సిక్స్‌‌‌‌‌‌‌‌తో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రహానె (13) బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించినా.. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరిగాడు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో అంగ్‌‌‌‌‌‌‌‌క్రిష్‌‌‌‌‌‌‌‌ రఘువంశీ (1)ని అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (1/27) బోల్తా కొట్టించడంతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 31/2తో ఎదురీత మొదలుపెట్టింది. అలెన్‌‌‌‌‌‌‌‌తో జత కట్టిన కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో కోల్‌‌‌‌‌‌‌‌కతా 43/2 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో 4, 6 కొట్టిన అలెన్‌‌‌‌‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లోనూ రిపీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

నాలుగు ఓవర్లలో 33 రన్స్‌‌‌‌‌‌‌‌ రావడంతో తొలి పది ఓవర్లలో 75/2 స్కోరు చేసింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో అలెన్‌‌‌‌‌‌‌‌ 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అలెన్‌‌‌‌‌‌‌‌ 6, గ్రీన్‌‌‌‌‌‌‌‌ 6 దంచారు. 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అలెన్‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో 21 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లు కొట్టాడు. ఇక విజయానికి మూడు రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో గ్రీన్‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌ తీస్తే, అలెన్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో 47 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే సెంచరీ చేశాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 116 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి 34 బాల్స్‌‌‌‌‌‌‌‌ మిగిలి ఉండగానే కేకేఆర్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాడు.

సంక్షిప్త స్కోర్లు

  • ఢిల్లీ: 20 ఓవర్లలో 142/8 (నిశాంక 50, అశుతోష్‌‌‌‌‌‌‌‌ 39, కార్తీక్‌‌‌‌‌‌‌‌ త్యాగీ 2/25). కోల్‌‌‌‌‌‌‌‌కతా: 14.2 ఓవర్లలో 147/2 (అలెన్‌‌‌‌‌‌‌‌ 100*, గ్రీన్‌‌‌‌‌‌‌‌ 33*, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ 1/27).
  • ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో మూడు ఫ్రాంచైజీల తరఫున వెయ్యికి పైగా రన్స్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసిన తొలి బ్యాటర్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌. పంజాబ్‌‌‌‌‌‌‌‌ (2548), లక్నో (1410), ఢిల్లీ (1002) తరఫున ఈ రన్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు.